
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
విజయవాడ(గాంధీనగర్) : అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామంటూ టీడీపీ ఎన్నికల న హామీని అమలు చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల జాయింట్ యాక‌్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు జీఎం దయాకర్ డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్స్ జేఏసీ సోమవారం «ఆందోళన చేపట్టింది. ఆయన మాట్లాడుతూ పదహారేళ్లు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా, అతితక్కువ వేతనంతో వెట్టిచాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో వేతన సంఘం కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్, డీఏ అమలు చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెట్టించుకోవడం లేదని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఆందోళనకు సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం.సుందరి, విజయశ్రీ, నజీర్, మోహన్‌రావు, కేవీకే రాజు, ఎం.సుందరరావు పాల్గొన్నారు.