
సమస్య మొదటికి ..
- స్పష్టతలేని కమిషనర్ ఉత్తర్వులు
- ఎటూ తేలని డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీ
- కమిషనర్‌కు డీఈఓ లేఖ
అనంతపురం ఎడ్యుకేషన్ :
విద్యాశాఖలో డిప్యూటీ డీఈఓ పోస్టుల (ఎఫ్‌ఏసీ) భర్తీ చేసే అంశంపై ఏర్పడిన వివాదం మళ్లీ మొదటకొచ్చింది. ఇప్పటికే డిప్యూటీ డీఈఓ పోస్టుల భర్తీలో తమకే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు ఓవైపు, జిల్లా పరిషత్ పాఠశాలల హెచ్‌ఎంల మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో సీనియర్ హెచ్‌ఎం, ఎంఈఓలతో పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో డీఈఓ ఇరకాటంలో పడ్డారు.
ఆరు డీప్యూటీ డీఈఓ పోస్టులు
జిల్లాలో ఆరు డెప్యూటీ డీఈఓ పోస్టులు ఉన్నాయి. అనంతపురం, ధర్మవరం, గుత్తి, పెనుకొండ డివిజన్లతో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ, జిల్లా పరిషత్‌లో పీఈఓ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురం డివిజన్ డీఈఓ, గుత్తి డివిజన్ ఏడీ–1 ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక పెనుకొండ డివిజన్‌కు డైట్ అధ్యాపకులు సుబ్బారావు ఉన్నారు. ధర్మవరం, ఆర్‌ఎంఎస్‌ఏ, జిల్లా పరిషత్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత ఉత్తర్వులతో అన్నిచోట్ల హెచ్‌ఎంలను నియమించాల్సి ఉంటుంది.
నిబంధనల ప్రకారం తమకే అవకాశం
ఇప్పటిదాకా డీప్యూటీ డీఈఓ పోస్టులను ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతోనే భర్తీ చేశారు. ఉమ్మడి సర్వీస్ (ప్రభుత్వ, జిల్లా పరిషత్)ను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన లేదంటున్నారు ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు. కొన్ని జిల్లాల్లో పరిషత్ పాఠశాలల హెచ్‌ఎంలకు అవకాశం ఇచ్చారని, అదే తరహా ఇక్కడ కూడా వారితో పాటు తమకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. తమకు అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయిస్తామంని రెండు వర్గాలూ చెబుతున్నాయి. దీంతో భర్తీ ప్రక్రియను డీఈఓ తాత్కాలికంగా నిలిపివేశారు.
సుబ్బారావు ఇక డైట్ కళాశాలకు..!
పెనుకొండ డిప్యూటీ డీఈగా పని చేస్తున్న డైట్ అధ్యాపకులు çసుబ్బారావు ఇక డైట్ కళాశాల అధ్యాపకుడిగానే కొనసాగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌చార్జ్ డెప్యూటీ డీఈఓలుగా కొనసాగుతున్న డైట్ అధ్యాపకులను ఆ బాధ్యతల నుంచి వెంటనే తప్పించాలంటూ కమిషర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇందుకు సబంధించిన ఫైలు కూడా సిద్ధం చేశారు. కమిషనర్ నుంచి స్పష్టత రాగానే అమలు చేస్తారు.
ఉత్తర్వుల్లో స్పష్టత లేదు.. : శామ్యూల్, డీఈఓ
డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే సీనియర్ హెచ్‌ఎంలు, ఎంఈఓలతో నియమించాలంటూ కమిషనర్ నుంచి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. ఉత్తర్వులో స్పష్టత లేదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు తమను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల హెచ్‌ఎంలు ఉమ్మడి సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు.దీనిపై కమిషనర్‌కు లేఖ రాశాం. సమాధానం రాగానే పోస్టులు భర్తీ చేస్తాం.