పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
Published Tue, Aug 16 2016 6:57 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
* పుష్కర నగర్‌ల నుంచి ఘాట్‌ల వరకు ఉచిత ప్రయాణం
* 150 బస్సులను తిప్పుతున్న అధికారులు
* ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్‌ఎం
* దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు
అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్‌ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్‌ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్‌ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్‌ల నుంచి ఘాట్‌కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు...
నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్‌కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement