ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె
- అనంతపురం జిల్లాలో ఎక్కడికక్కడే నిలిచిపోయిన బస్సులు
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కార్మికులు చేపట్టిన సమ్మె ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జిల్లాలోని 12 డిపోల్లో 250 బస్సులు కదలలేదు. వన్ మ్యాన్ సర్వీసులను రద్దుచేయాలని, అధికారుల వేధింపులు మానాలని, ఆర్‌ఎం మొండివైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది.
కాగా, మిగిలిన కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు విధులకు హాజరయ్యారు. అయినా ఎంప్లాయీస్ యూనియన్‌కు చెందిన కార్మికులు డిపోల వద్ద ధర్నా చేశారు. ఉదయం 7 గంటల వరకూ 250 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేదాకా సమ్మె ఆగదని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రకటించారు. చాలా బస్‌సర్వీసులు రద్దుకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.