నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం
ఆర్టీసీ ఆర్‌ఎం రవికుమార్
తుని :
రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో నాలుగు నెలలకు రూ.8 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఆర్‌ఎం సి.రవికుమార్ తెలిపారు. తుని డిపోలో వివిధ విభాగాలను మంగళవారం పరిశీలించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్) తగ్గడంతో ఏప్రిల్ నుంచి జూలై వరకూ అన్ని డిపోలూ కలిపి రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం ఓఆర్ 65 శాతం ఉందన్నారు. కిలోమీటరుకు రూ.32 ఖర్చవుతుండగా, రూ.26 ఆదాయం వస్తోందన్నారు. నష్టాల భర్తీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాలకు రీజియన్ నుంచి రోజుకు 70 నుంచి వంద ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆయన వివరించారు. అలాగే పార్సిల్ సర్వీసు ద్వారా రూ.కోటి ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆయన వెంట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టరు వై.చెల్లారావు ఉన్నారు.