రుయా గుండె ఆగింది
తిరుపతి మెడికల్ : రుయా ఆస్పత్రికి రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి నిత్యం 1,300 నుంచి 2 వేల మంది వరకు రోగులు వస్తుంటారు. ఇందులో బీపీతోపాటు గుండె జబ్బులతో బాధపడేవారు వంద మందికిపైనే ఉంటారు. వీరికోసం ఇక్కడ ఏర్పాటు చేసిన గుండె జబ్బుల విభాగానికి ప్రస్తుతం డాక్టర్లు కరువయ్యారు. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉండాల్సి ఉంది. కానీ ఒక్క డాక్టరూ లేరు. వైద్యం కోసం వచ్చే రోగులు నరకయాతన పడుతున్నారు. ప్రత్యేక డాక్టర్ లేకపోయినా ఒకే ఒక చిన్న పిల్లల డాక్టర్‌తో మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు గుండెపోటుకు గురై అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు పక్కనే ఉన్న స్విమ్స్ ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది.
భవనం చూస్తే గుండె జారిపోవాల్సిందే!
రుయాలో గుండె జబ్బుల విభాగం 1986లో ప్రారంభమైంది. నాటి నుంచి ఈ విభాగాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం భవనం మొత్తం శిథిలావస్థకు చేరింది. కొన్ని గదులు నిర్మానుష్యంగా మారాయి. ఐసీయూ విభాగంలో తరచూ పైకప్పు ఊడిపడుతోంది. స్లాబు నుంచి మట్టి, రాళ్లు పడుతున్నాయి. భవనం కూలిపోతుందేమోనని రోగులు, వైద్యులు, సిబ్బంది బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన వైద్య పరికరాలు మూలనపడ్డాయి.
కొత్త భవనం నిర్మించాలని చెప్పినా..!
గత ఏడాది ఐఐటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి గుండె జబ్బుల విభాగంలో సీలింగ్, గోడలను పరిశీలించారు. నిపుణుల సాయంతో సీలింగ్ పటిష్టంగా ఉందా లేదా, వాటి ఆయుష్షు ఎంత ఉందో స్వయంగా చూశారు. మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. భవనం శిథిలావస్థకు చేరిందని తేల్చారు. ఉన్నదాన్ని పడగొట్టి కొత్త భవనం నిర్మిచాలని చెప్పారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేరు. ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విభాగానికి మోక్షం కలగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీటీ సర్జన్ సేవలు నిరుపయోగం
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై అత్యవసర వైద్య సేవల కోసం పలువురు రోగులు వస్తుంటారు. ఇందులో పాలిట్రామా కేసుల్లో భాగంగా పక్కెటెముకలు విరగడం, తలకు గాయాలు, కాళ్లు, చేతులు విరిగి రక్తనాళాలు దెబ్బతినడం వంటి కేసులు అధికంగా ఉంటాయి.
కార్డియాలజీ కేసులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే ముందుగా కార్డియోథొరాసిక్ సర్జన్ (సీటీ సర్జన్) విభాగంలోని సేవలు చాలా కీలకం. రోగిని పరీక్షించి ఆపరేషన్‌కు రెఫర్ చేస్తుంటారు. దీనికోసం రుయాకు ఉస్మానియా నుంచి ఓ ప్రొఫెసర్ స్థాయి కార్డియా థొరా సిక్ సర్జన్ నియమించారు. కానీ ఆ విభాగమే లేకపోవడంతో కనీసం ఓపీ కూడా నిర్వహించలేని పరిస్థితి.