మహానందీశ్వరుడికి సహస్రఘటాభిషేకం
– ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం
మహానంది : మహానందీశ్వరస్వామివారికి ఆదివారం సహస్రఘటాభిషేక పూజలు వైభవంగా జరిగాయి. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, పండిత బృందం ఆధ్వర్యంలో విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహస్ర ఘటాల్లో గంగావాహన, ఉత్సవ మూర్తులకు చూర్ణోత్సవం, కలశ ఉద్వాసన, పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మహానందీశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం చేపట్టారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజు, శివారెడ్డి పాల్గొన్నారు.