రైతుల కోసం.. ఎందాకైనా.. | sakshi charcha vedika in ananatapur | Sakshi
Sakshi News home page

రైతుల కోసం.. ఎందాకైనా..

Published Thu, Sep 8 2016 10:59 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రైతుల కోసం.. ఎందాకైనా.. - Sakshi

రైతుల కోసం.. ఎందాకైనా..

►   ప్రభుత్వం చేతిగానితనం వల్లే జిల్లాలో కరువు
►   రెయిన్‌గన్‌లు బూటకం
►   ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఎగ్గొట్టే చర్యలను ఎదుర్కోవాలి
►   ఫసల్‌బీమాలో వేరుశనగను చేర్చాలి
►   హంద్రీ–నీవా ఫేజ్‌–1  ఆయకట్టుకు తక్షణమే నీళ్లివ్వాలి
►   రైతుల సంక్షేమం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లాలో బస్సుయాత్ర
►   ‘అనంత’కరువు, సాగునీటి ప్రాజెక్టులపై ‘సాక్షి’ చర్చావేదికలో వక్తలు
►   రైతులు, జిల్లా ప్రజల సంక్షేమం కోసం 7 అంశాలపై తీర్మానాలు


‘అనంతకు కరువు కొత్తకాకపోయినా...ఈ ఏడాది కరువు పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రెయిన్‌గన్‌లతో నీళ్లిచ్చామని తప్పుడు మాటలు చెబుతూ రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఎగ్గొట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. హంద్రీ–నీవా ఫేజ్‌–1  ఆయకట్టుకు నీళ్లివ్వకుండా  అన్యాయం చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, కుల, ప్రజా, విద్యార్థి, మహిళా సంఘాలతోపాటు  రచయితలు, మేధావులు, ఇలా అన్నివర్గాల వారు కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడాలి. లేదంటే జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంద’ని వక్తలు ముక్తకంఠంతో అన్నారు.

        ‘అనంత కరువు, సాగునీటిప్రాజెక్టుల ఆవశ్యకత –మన బాధ్యత’ అనే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో చర్చావేదిక నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంతో పాటు ఆయా పార్టీల అనుబంధసంఘాల ప్రతినిధులు, రచయితలు, అధ్యాపకులు, సీనియర్‌ జర్నలిస్టులు, రైతులు పాల్గొన్నారు. వేరుశనగ పంట నష్టపోయామని, రెయిన్‌గన్‌లతో తమను ఆదుకోలేదని  పలువురు రైతులు తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. రైతుల నష్టపోయిన వైనం, ప్రభుత్వం అనుసరించిన పద్ధతులను బేరీజు వేస్తూ చర్చ సాగింది. వేరుశనగ పంట ఎండిన విషయం తన కు మంత్రులు, అధికారులు చెప్పలేదని సీఎం వ్యాఖ్యానించడం, పంటలను కాపాడటంలో ప్రభుత్వ ఘోరవైఫల్యం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు లెక్కలతో అధికార యంత్రాంగం కూడా మోసానికి తెగించడం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ అలసత్వం, హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరివ్వకుండా జరుగుతున్న మోసంతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఉదయం 11  నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ చర్చ కొనసాగింది. జిల్లాకు కరువు కొత్తకాదని, ఇప్పటి వరకూ ప్రభుత్వాలు పలురకాలుగా కరువు రైతులను ఆదుకున్నాయని, మాయమాటలతో రైతులను మోసం చేసి, ఆత్మసై్థర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తోన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నానని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ విషయంలో ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. రక్షకతడులతో పంటలను కాపాడామంటూ ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసేందుకు  ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఫసల్‌బీమాలో వేరుశనగను చేర్చకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. 

రైతులు సాగుచేసిన తక్కిన పంటలను కూడా వేరుశనగగా బ్యాంకర్లు రికార్డు చేయడంతో బీమా మంజూరులో అన్యాయం జరిగే ప్రమాదముందన్నారు. ప్రీమియం చెల్లించిన రైతులకు హక్కుగా బీమా రావాలని, ఇందులో ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ బీమాకు సంబంధించి వివరాలు నమోదు చేసేందుకు జిల్లాలో 140 వెదర్‌స్టేషన్లు ఉన్నాయని, అయితే.. గతేడాది వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లారైతులకు జరుగుతున్న అన్యాయంపై అన్నిపార్టీలు, వర్గాలు కలిసి ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ వర్షంతో పంట పండటమే కష్టమైతే ‘చినుకుల’తో పంట కాపాడామంటూ మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదన్నారు.

సీపీఐ సీనియర్‌ నాయకులు ఎంవీరమణ మాట్లాడుతూ ‘అనంత’కు జరిగిన అన్యాయంలో అన్ని రాజకీయపార్టీలు దోషులే అన్నారు. సాగునీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్నా.. ఏళ్లుగా ప్రదర్శించిన నిర్లిప్తతే ప్రస్తుత దుర్భరపరిస్థితికి కారణమన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరించిన వైఖరితో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. ఇప్పటి వరకూ 190 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, భవిష్యత్తులో జరిగే ఏ ఆత్మహత్య అయినా ప్రభుత్వ హత్యగానే భావించాల్సి వస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ అందరితో కలిసి పోరాడుతుందన్నారు.

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రెయిన్‌గన్‌లతో పంటలను కాపాడామని చంద్రబాబు చెప్పడం అభూతకల్పనగా కొట్టిపారేశారు. రైతుల కోసం ప్రతిపక్షాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమన్నారు. సీనియర్‌జర్నలిస్టులు ఆజాద్, మచ్చారామలింగారెడ్డి, టి.రామాంజనేయులు, రసూల్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాజకీయపార్టీలకు జర్నలిస్టులు పూర్తి మద్దతుగా ఉంటారని, ఏ ఉద్యమం చేపట్టినా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృ  షి చేస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement