హరిత'గీతం'
♦ హరితహారానికి ‘సాక్షి’ చేయూత
♦ ఈదుల గుడ్డంలో ఈత వనాల పెంపకం
♦ నాలుగేళ్లలో పూర్వవైభవం
♦ గీత కార్మికులకు ఉపాధి ఎమ్మెల్యే సోలిపేట తోడ్పాటు
♦ ఈ పండుగలో మంత్రి హరీశ్‌రావు భాగస్వామ్యం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : చిట్టాపూర్‌లోని ఈదులగుడ్డంలో గతంలో దట్టమైన ఈత వనం ఉండేదట. 70-80 ఏళ్ల కిందట ఈ స్థలంలో పశువులు దూరలేనంతగా దట్టమైన ఈత వనం ఉండేదట. నిండు పున్నమి నాడు వనంలోకి వెళ్లినా అమావాస్య చీకట్లే కనిపించేదట. ఇప్పుడా ఈదులు లేవు. పూర్తిగా అంతరించి బీడుగా మిగిలింది. ఫలితంగా గీత కార్మికుల బతుకులు మోడువారాయి. బీడు భూమికి పూర్వ వైభవం తీసుకొచ్చి, పడావుపడిన గౌడకులస్తుల కల్లు మండ్వాల్లో పచ్చని పంది రి వేసే బాధ్యతను ‘సాక్షి’ భుజానికి ఎత్తుకుంది. ఆకుపచ్చ ఆవరణ.. బంగారు బతుకుల కోసం ‘సాక్షి’ హరితహారం లో భాగం పంచుకుంటోంది. గ్లొబలైజేషన్ ధాటికి కుప్ప కూలిన ఈత వనాలను నిలబెట్టి, ఉపాధికి దూరమై గల్ఫ్ దేశాలకు వలస పోతున్న గీత కార్మికుల బతుకుల్లో పూర్వ వైభవం నింపటం కోసం ‘సాక్షి’ ఓ అడుగు ముందుకేసింది.
‘సాక్షి’ చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తోడయ్యారు. ఆయన తన సొంతూరైన చిట్టాపూర్‌లోని ఐదు ఎకరాల్లో ఈత వనాలు నాటడానికి తొలి అవకాశం కల్పించారు. చిట్టాపూర్‌లో గీత కార్మిక సొసైటీకి 3.30 ఎకరాల భూమి ఉంది. దానికి ఆనుకొని రామలింగారెడ్డి పూర్వీకుల భూమి కూడా కొంత ఉంది. ఈ స్థలాన్ని సొసైటీకి ఇవ్వడానికి ఎమ్మెల్యే ముందుకొచ్చారు. ఎప్పటి నుంచో పడావు పడిన ఈ మొత్తం కలిపి దాదాపు 5 ఎకరాల స్థలంలో ఈత వనా లు నాడటానికి ప్రణాళిక సిద్ధమైంది. గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధి, స్థానిక గీత కార్మికుల నాయకులు, స్థానిక సర్పంచు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన తన నివాసంలో గ్రామ పెద్దలతో కలిసి సమాలోచన చేశారు. నాటుతున్న మొక్కలు నాలుగేళ్లలోనే కల్లును ఇస్తాయని, వీటి ద్వారా గీత కార్మికులు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. తన నిధులతో రెండు బోరు బావులను తవ్విస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రమేశ్‌రెడ్డి, గీత కార్మిక సొసైటీ ముఖ్యులు సర్వయ్యగారి నర్సాగౌడ్, తీగల స్వామిగౌడ్, వెంకటస్వామిగౌడ్, ఇర్కోడు రామాగౌడ్, నాంపల్లి నర్సింహాగౌడ్, ఎలగాని ఎల్లంగౌడ్, బొమ్మ బుచ్చయ్య, ఆగం నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిట్టాపూర్‌లో ‘సాక్షి’ హరిత పండుగ..
‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో 15 వేల మంది గీత కార్మికులతో చిట్టాపూర్‌లో హరిత పండుగ నిర్వహిస్తున్నట్టు చిట్టాపూర్ గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, గౌడ కుల పెద్ద శివగౌడ్ తెలిపారు. ఈ పండుగకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా, ఇతర ప్రముఖులు, గీత కార్మిక నేతలు అతిథులుగా రానున్నారని వారు చెప్పారు. జిల్లాలోని గీత కార్మికులంతా ఈ పండుగలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు.