మా ఆయన వయసు 27 ఏళ్లు. మా పెళ్లై ఏడాదయింది. ఒకరోజు రాత్రి నా దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంటూ మురిసిపోవడం చూసి షాక్ తిన్నాను. ఏమిటిది అని అడిగితే అలా డ్రెస్ చేసుకుని ఆనందిస్తుంటానని చెప్పారు. నేనెంత గొడవ చేస్తున్నాన, ఆయన మాత్రం అప్పుడప్పుడు అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రిపూట నా డ్రెస్ వేసుకుని, ఉదయం మార్చుకుని ఆఫీసుకు వెళుతున్నారు. ఇతరత్రా మేము హ్యాపీగానే ఉన్నాం కానీ ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని చాలా భయంగా ఉంది. మా వారి ఈ వింత ప్రవర్తనకు ఏదైనా పరిష్కారముందా?
– సంధ్య, హన్మకొండ
మీ వారు ట్రాన్స్ వెస్టిజమ్ అనే ఒక అరుదైన సమస్యకు లోనయినట్లు అర్థమవుతోంది. పురుషుడు స్త్రీగాను, స్త్రీ– పురుషుడుగానూ అలంకరించుకుని లైంగికానందం పోందే ఈ వింత సమస్యకు ఒక ముఖ్య కారణం చిన్న వయసులో తల్లిదండ్రులు అమ్మాయిలు లేరని అబ్బాయిలకు గౌను, జడ వేసి పూలు పెట్టి అమ్మాయిలు లేని లోటును ఇలా తీర్చుకోవటం. మీ దాంపత్య జీవితం బాగానే ఉందన్నారు కాబట్టి కొంతవరకు నయం. మీరు ఆయనను ఎలాగైనా చికిత్సకు ఒప్పించగలిగితే సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో బిహేవియర్ మాడిఫికేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లాంటి కొన్ని ప్రత్యేక మానసిక చికిత్సలు చేసి మీ వారిని ఆ ప్రవర్తన నుంచి బయట పడేయవచ్చు. కేవలం మందుల ద్వారా లేదా కౌన్సెలింగ్ ద్వారా ఇలాంటి వింత ప్రవర్తనను మార్చలేము. రెండూ అవసరమే.
ప్రేమికుడు దూరమవుతాడేమో...
నేను గత రెండు సంవత్సరాలనుండి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నాం కానీ ఈ మధ్య నాలో ఒక కొత్త భయం మొదలయింది. తను ఇంకెవరితో అయినా కొత్తగా బంధాన్ని ఏర్పరుచుకుంటాడేమో అని.. ఈ ఆలోచన నుంచి నేను బయట పడలేక΄ోతున్నాను. దీనికి కారణం ఏంటి? ఎలా ఈ ఆలోచన నుంచి బయటపడాలి?
– రాణి, జనగామ
మీలో ఏర్పడిన ఈ భయం కేవలం మీ ఊహ కావచ్చు. అకారణంగా కొందరిలో ఇలాంటి అభద్రతా భావాలు రావడం సహజమే! ఈ అభద్రత రావడానికి మీ రిలేషన్‌లో ఇటీవల ఏమైనా ఆ మార్పులు వచ్చాయా? లేక మీరు ఇంకేదైనా ఒత్తిడిలో ఉండి ఇలా ఆలోచిస్తున్నారా అని స్వయం పరిశీలన చేసుకోండి. మీ ప్రేమికుడితో మీ భయాన్ని పంచుకోండి. అతణ్ణి నొప్పించకుండా, నిందించకుండా ఎలాంటి సందర్భాలలో మీకీ భావాలు కలుగుతున్నాయో చెప్పడం ద్వారా అతను కూడా మీ బాధను అర్థం చేసుకుని, మీలోని ఫీలింగ్స్‌ను తగ్గించేందుకు తప్పకుండా సహకరిస్తాడు. మీ అభద్రత భావాన్ని అధిగమించాలంటే ఇద్దరూ కలిసి సమయాన్ని గడపటం, ఇద్దరికీ ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి.
దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, ఏదైనా కొత్త హాబీ, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయండి. ఇదే విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసి, అతడిలో మీకు బాగా నచ్చిన విషయాలు లేదా అంశాలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకోండి. దీర్ఘకాలం ΄ాటు ఉండే రిలేషన్‌షిప్స్‌లో అభద్రత కొంత సహజమే అయినప్పటికీ అది మిమ్మల్ని మరీ బాధించి, మనోవేదనకు గురి చేస్తుంటే మాత్రం ఒకసారి సైకియాట్రిస్ట్‌ను లేదా క్లినికల్ సైకాలజిస్టును మీ ఇద్దరూ కలిస్తే, మీలోని ఈ భయాన్ని, అభద్రతను తగ్గించి, మీ మధ్య సంబంధాన్ని మరింత బలపర్చేందుకు కౌన్సెలింగ్ ద్వారా తగిన సూచనలు, సలహాలు చేస్తారు. ఆల్ ద బెస్ట్!
– డా. ఇండ్ల విశాల్ రెడ్డి
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment