మాదిగలను మోసగించిన చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు మాదిగలు మరో మహా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్ పిలుపునిచ్చారు.
ఐక్య పోరాటానికి అందరూ సిద్ధం కావాలి
నందిగామలో ఎమ్మార్పీఎస్ భిక్షాటన
నందిగామ రూరల్ :
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు మాదిగలు మరో మహా ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్ పిలుపునిచ్చారు. వర్గీకరణ కోసం ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా బుధవారం సాయంత్రం నందిగామ పట్టణంలో భిక్షాటన చేశారు. దొండపాటి మాట్లాడుతూ, మాదిగలను ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో వారిపై ప్రేమ నటిస్తూ, అధికారం దక్కించుకున్న తరువాత వారి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇందుకోసం అవసరమైతే పెద్ద మాదిగనవుతానంటూ చెప్పు కుట్టి, డప్పు కొట్టి మరీ హామీ ఇచ్చారన్నారు. ఆయన మాటలు నమ్మి మాదిగలు చంద్రబాబు పర్యటనకు రక్షణ గోడగా నిలవడమే కాకుండా ఆంధ్రలో అధికారం దక్కించుకోవడంలో కీలక భూమిక పోషించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, రెండేళ్లు దాటిపోయినా, ఇప్పటివరకు వర్గీకరణ ఊసే ఎత్తకపోగా, వర్గీకరణ అవసరం లేదంటూ తన మంత్రులు, నాయకులతో ప్రకటనలు గుప్పించడం మాదిగలను దారుణంగా అవమానించడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంద పిచ్చయ్య, కనకపూడి వెంకటరత్నం, బంక మహేష్, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.