మగ సంతానం కోసం రెండో పెళ్లి
నిలదీసిన మొదటి భార్యపై హత్యాయత్నం
మదనపల్లె క్రైం (చిత్తూరు) : మగ సంతానం కోసం రెండో పెళ్లి చేసుకుని, విషయం తెలిసి నిలదీసిన మొదటి భార్యపై హత్యాయత్నం చేసిన భర్త ఉదంతమిది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల కథనం మేరకు... చిత్తూరు జిల్లా పీటీఎం మండలం చలిమామిడికి చెందిన నరసింహులు, ఉత్తమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె లక్ష్మీనరసమ్మను అనంతపురం జిల్లా కదిరి పట్టణం బాలప్పగారి క్వార్టర్స్‌లో ఉంటున్న సత్తెన్న, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ఎస్.శ్రీనివాసులుకు ఇచ్చి 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టారు. మగ సంతానం లేకపోవడంతో శ్రీనివాసులు రెండో పెళ్లి చేసుకోవాలని ఏడాది కాలంగా భార్యను వేధిస్తున్నాడు.
ఈ క్రమంలో నెల రోజుల క్రితం శ్రీనివాసులు అదే జిల్లా గాండ్లపెంట మండలం ఎర్రచేనుకు చెందిన లక్ష్మి అనే యువతిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. నాలుగు రోజుల క్రితం భర్తను నిలదీయడంతో అతను ఆమెపై ఇటుక రాళ్లతో విచక్షణ రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వారు గమనించి బాధితురాలిని పుట్టింటికి పంపించారు. తీవ్ర గాయాలతో అవస్థలు పడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వారు పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.