గన్‌తో కాల్చేస్తానంటూ భక్తులను బెదిరించిన ఎస్సై
తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠ దైవాన్ని దర్శించుకునేందుకు సుదూరాల నుంచి వచ్చిన భక్తులతో ఓ ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న సమాచారం అడిగిన పాపానికి భక్తులపై అంతెత్తుఎగిరిపడ్డ ఆ ఎస్సై.. సర్వీస్ రివాల్వర్ చూపించి కాల్చిపారేస్తానంటూ బెదిరించాడు. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జేఈవో ఆఫీసుకు ఎలా వెళ్లాలో తెలియక.. పక్కనే ఉన్న ఎస్ఐ నాగేశ్వర్ ను అడిగారు. అంతే, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భక్తులపై విరుచుకుపడ్డారు ఎస్సై నాగేశ్వర్. సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి కాల్చేస్తానని బెదిరించాడు. ఎస్సై చర్యను నిరసిస్తూ భక్తులు వాగ్వాదానికి దిగారు. అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీఎస్సీ భక్తులకు సర్దిచెప్పి పంపించారు. సదరు ఎస్సై నాగేశ్వర్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్ పై తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్నారు.