► ముందుకు కదలని స్మార్ట్‌పల్స్ సర్వే
► ఒకరోజు సిగ్నల్, ఇంకోరోజు నెట్, మరోరోజు వెర్షన్ సమస్య
► ఒక్కో ఇంటికి రెండు గంటలకుపైగా సమయం
► తలలు పట్టుకుంటున్న ఎన్యుమరేటర్లు
► నిర్ణీత గడువులోగా మొదటి విడత పూర్తి అనుమానమే
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకరోజు సిగ్నల్ సమస్య, ఇంకోరోజు ముందుకు కదలని నెట్, మరోరోజూ వెర్షన్ మార్పు...ఇలా రకరకాల సమస్యలతో సర్వే నత్తనడకను తలపిస్తోంది. ఒక్కో ఇంటిని అరగంటలోపు సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, సాంకేతిక సమస్యల కారణంగా రెండు గంటలకు పైగా పడుతోంది. దాంతో ఎన్యుమరేటర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఒంగోలు టౌన్: జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే నత్తనడకన సాగుతోంది. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అతికష్టం మీద రెండువేల గృహాలను పూర్తి చేశారు. ఈ లెక్కలను చూసి దిమ్మతిరిగిన యంత్రాంగానికి రాష్ట్రవ్యాప్తంగా పోల్చుకుంటే ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉందంటూ తేలడంతో నవ్వాలో ఏడవాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉంది.
జిల్లాలో 8లక్షల 60 వేల 4643 కుటుంబాలు ఉన్నాయి. రెండు విడతల్లో ఆ కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ఈనెల 8 నుంచి 30వ తేదీ వరకు మొదటి విడత, ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు రెండో విడత సర్వే చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సర్వే కోసం 2312 ఎన్యుమరేటర్ బ్లాకులుగా గుర్తించింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 1932, పట్టణ ప్రాంతాల్లో 285, నగర పంచాయతీల్లో 95 బ్లాక్‌లుగా విభజించింది. ప్రతి ఎన్యుమరేటర్‌కు ట్యాబ్, బయోమెట్రిక్ డివైస్ అందిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ముందుగా ప్రకటించింది. ట్యాబ్‌లు తగినంతగా లేకపోవడంతో ఇతర శాఖల్లో అమలు చేస్తున్న ట్యాబ్‌లను హడావుడిగా తెప్పించి సర్వే చేపట్టారు.
సర్వర్ డౌన్ : సర్వే ప్రారంభించిన రోజు నుంచి నెట్ సమస్య, సర్వర్లు డౌన్ కావడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు పదేపదే ప్రకటించినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమైంది. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉండటం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 14 ఇళ్లు సర్వే చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే సాంకేతిక సమస్యలతో రెండిళ్లు దాటి ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దానికితోడు సర్వేకు సంబంధించి 80 రకాల ప్రశ్నలకు సమాధానాలను సేకరించాల్సి రావడంతో అధిక సమయం తీసుకుంటోంది.
ఒక ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలన్నీ సేకరించడంతోపాటు వారికి సంబంధించిన ఐరిష్ లేదా తంబ్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి చంద్రన్న బీమా పథకం కూడా ఎన్యుమరేటర్లకు తలనొప్పిగా మారింది. అసంఘటిత కార్మికులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ పథకం ద్వారా ఎలాంటి ఉపయోగం కలుగుతుందన్న విషయాన్ని ఎన్యుమరేటర్లు సమగ్రంగా చెప్పలేకపోవడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ఏ రోజు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ముందుగా ప్రకటించకపోవడం ఆలస్యానికి మరింత కారణమవుతోంది. పైగా సర్వే అంశాల వల్ల తాము నష్టపోతామన్న భయం కూడా అనేక మందిని పట్టి పీడిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అందించేందుకు స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ, అందుకు విరుద్ధంగా తమకు అందుతున్న పథకాలకు ఎక్కడ పంగనామం పెడతారోనన్న భయం ప్రజలను పట్టిపీడిస్తోంది.
జిల్లాలో అడుగుపెట్టని స్పెషల్ ఆఫీసర్
స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి అన్ని జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా గతంలో జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన కరికాల వళవన్‌ను ప్రకాశంకు కేటాయించింది. అయితే స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమై వారం రోజులు దాటినా ఇంతవరకు స్పెషల్ ఆఫీసర్ జిల్లాలో అడుగుపెట్టలేదు. ప్రతిచోట ఏదో ఒక సమస్య వస్తుండటం, దానిని పరిష్కరించేసరికి సంబంధిత అధికారులకు తలబొప్పి కడుతున్న తరుణంలో స్పెషల్ ఆఫీసర్ రాకవల్ల పెద్దగా ప్రయోజనాలు కనిపించడం లేదు.