
ఆటో డ్రైవర్స్ సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్
వికారాబాద్ రూరల్: అసంఘటిత కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కార్మికుల బతుకులు దయనీయ స్థితిలో కొనసాగుతున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆటో డ్రైవర్స్ కార్మికల సమస్యలపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యమత్యమై సమస్యల సాధన కోసం పోరాడాలన్నారు. పెరిగిపోతున్న జనాభా అవసరాలు తీర్చడంలో ఆటో కార్మికులు సమాజంలో కీలకమన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అగ్రభాగాన ఉంటుందన్నారు. ప్రస్తుత ఆటో కార్మికుల ఆటో అడ్డాల సమస్యలు, పోలీసుల అక్రమ చలాన్లు, జరిమానాలు, కోర్టు ఫైన్లు, ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం పెంచుతున్నారన్నారు. ఆటో కార్మికులు లైసెన్సు కోసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి నిబంధనలతో చదువురాని కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్టీఏ అధికారులు, పోలీసుల వేధింపులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు పి.అశోక్, పి.మల్లేశం, ఆటో డ్రైవర్లు ప్రసాద్, శ్యామ్, అంబయ్య, జంగయ్య, అశోక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.