రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సహకారం
– తిరుపతి రైల్వే స్టేషన్‌లో హైస్పీడ్ వైఫై సేవలు
– నెల్లూరు నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి
– తిరుపతిలో ఏర్పాటుచేసిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బొజ్జల
తిరుపతి అర్బన్: రైల్వే సేవలను రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఆదివారం హై–స్పీడ్ వైఫై సేవలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు నెల్లూరు నుంచి రిమోట్ వీడియో ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని రైల్వే మెయిన్ బుకింగ్ కార్యాలయంలో గుంతకల్ డీఆర్‌ఎం గోపీనాథ్ మాల్యా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు మంత్రి బొజ్జల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో మెరుగైన పౌర సేవల కోసం ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. అందులో భాగంగానే రైల్వేల్లో హై–స్పీడ్ వైఫై సేవలను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ తిరుపతిని వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత రైల్వే మంత్రి సురేష్ ప్రభు నేతత్వంలో అడుగులు వేగంగా వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సహకారం
Published Sun, Jul 24 2016 8:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
Advertisement
Advertisement