కళ్లకు గంతలతో నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు నగరంలోని మార్కెట్ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి మాట్లాడుతూ హోదా కోసం సీఎం చంద్రబాబు నాయుడు పోరాటం చేయాలని, హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. హోదా కోసం టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని, 14వ ఆర్థికS సంఘ సిఫార్సుల ప్రకారం కుదరదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ బంద్‌కు మద్దతు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన మేరకు ఆగస్టు 2న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి తెలిపారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, నాయకులు ఎస్‌డీ గౌస్ బాషా, రాజేష్, కొవ్వూరి హరి ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.