జీవితంపై విరక్తితో..
- భర్త, అత్తింటి వేధింపులు భరించలేక కోడలి ఆత్మహత్యాయత్నం..
- కడుపునొప్పి తాళలేక మరొకరు..
- ధర్మవరంలో ఒకే రోజు రెండు ఘటనలు
ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకు పెళ్లై పట్టుమని మూడేళ్లు కాకనే వేధింపులు మొదలయ్యాయి. సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురి చేశారు. వారి వేధింపులు, చేష్టలు శ్రుతిమించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. చావే శరణ్యమనుకున్న ఆమె చివరకు ఆత్మహత్యాయత్నం చేసింది. కడుపునొప్పి భరించలేక మరొకరు కూడా తనువు చాలించాలనుకుని యాసిడ్ సేవించాడు. ఇలా వారిద్దరూ ఇప్పుడు ఆస్పత్రిపాలయ్యారు.
- ధర్మవరం అర్బన్
ధర్మవరం రాంనగర్‌కు చెందిన శోభారాణి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మంజునాథ్ సహా అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె ఫినాయిల్ తాగి ఈ చర్యకు యత్నించారు. వారి వివాహమై మూడేళ్లవుతోంది. మంజునాథ్ ఉరవకొండలోని గాలిమరల కార్యాలయంలో పని చేస్తున్నాడు. కొన్ని నెలలుగా భార్యను మంజుతో పాటు అతని కుటుంబ సభ్యులు మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని బాధితురాలు తన పుట్టింటి వారికి తెలిపారు. వారు రంగంలోకి దిగి పలుమార్లు పంచాయితీ పెట్టి సర్దుబాటు చేసి, తిరిగి కాపురానికి పంపారు. అయినా భర్త, అత్తింటి వారిలో మార్పు రాకపోగా, పంచాయితీ పెట్టిస్తావా అంటూ.. మరింతగా వేధించేవారు.
ఇక ఫలితం లేదనకున్న శోభారాణి చివరకు ఆత్మహత్యాయత్నం చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శోభారాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని శోభారాణి విలేకరులకు తెలిపారు. ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన డ్రైవర్ మారుతీ కడుపునొప్పి తాళలేక యాసిడ్ తాగి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు బంధువులు తెలిపారు. గమనించి భార్య శివమ్మ బంధువుల సహకారంతో వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు.