
అలాంటి నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తా
ధవళేశ్వరం: సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని సినీనటుడు సుమన్ చెప్పారు. గురువారం ధవళేశ్వరంలో జనార్దనస్వామి కొండపై జరుగుతున్న ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అవినీతి పెరిగిపోయిందన్నారు.
ఇతర దేశాల్లో కూడా అవినీతి ఉన్నప్పటికీ అక్కడ సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు. సామాన్యుడిని సంతోషంగా ఉంచే నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఇప్పటివరకూ వివిధ భాషల్లో 400 చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. సైనికుడు, రైతు, డాక్టర్ పాత్రలతో పూర్తి స్థాయి చిత్రంలో నటించాలన్నది తన కోరికన్నారు. సైనికుడు లేని దేశాన్ని ఊహించలేమని, రైతు లేకుంటే ఒక్కరోజు గడవదని, పునర్జన్మను ప్రసాదించే డాక్టర్ వృత్తంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు.
ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. గోదావరి జిల్లాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రకృతి అందాలు ఆనందింపజేస్తాయని అన్నారు. దర్శకుడు జీఎన్‌ఎస్ ప్రసాద్ కథను నమ్మి ఒరియా భాషలో తొలిసారి నటిస్తున్న సినిమా సూపర్‌హిట్ అవుతుందన్నారు.