సన్‌స్ట్రోక్ 45.8 డిగ్రీలు
సన్‌స్ట్రోక్ 45.8 డిగ్రీలు
Published Wed, Apr 26 2017 11:28 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
– భానుడి భగభగ
– వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
– ఇప్పటివరకు 40 మంది దాకా మృతి
అనంతపురం అగ్రికల్చర్ : భానుడు భగ్గుమంటున్నాడు. ‘అనంత’ను నిప్పుల కుంపటిలా మార్చేస్తున్నాడు. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పశుపక్ష్యాదులు, జంతుజాలం కూడా విలవిలలాడుతున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడు పంజా విసురుతున్నాడు. బయట అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకొచ్చిన వారు నీళ్లు, నీడ కోసం పరుగులు తీస్తున్నారు. హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు మినహా జిల్లా అంతటా 40 డిగ్రీలకు తక్కువగా కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు కొనసాగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. బుధవారం శింగనమల మండలం తరిమెల గ్రామంలో ఏకంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తాడిపత్రి 44.6 డిగ్రీలు, తాడిమర్రి 44.4, కూడేరు 44.4, శింగనమల 44.3, పుట్లూరు 44.2, యల్లనూరు 43.9, పామిడి 43.7 డిగ్రీలు... ఇలా చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 26 నుంచి 29 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం ఉదయం 40 నుంచి 60 వరకు ఉంటున్నా.. మధ్యాహ్నానికి దారుణంగా పడిపోతోంది. ఆ సమయంలో 10 నుంచి 15 శాతం మాత్రమే నమోదవుతోంది. 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు వీస్తున్నాయి.
నీటికి కటకట
గత ఏడాది ఆగస్టు నుంచి జిల్లాలో ఒక్క భారీ వర్షం కూడా పడలేదు. దీంతో చెక్‌డ్యాంలు, కుంటలు, చెరువులు ఒట్టిపోయాయి. పట్టణీకరణ, నగరీకరణ పేరుతో పెద్ద వృక్షాలను అడ్డంగా నరికేయడంతో ఎండతీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పచ్చదనం కనుమరుగైంది. తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నారు. పండ్లతోటలు, పట్టు, పాడి, పశుసంపద పరిస్థితి దయనీయంగా తయారైంది. మండే ఎండలకు పిల్లలు, వృద్ధులతో పాటు రైతులు, కూలీలు, వ్యాపారులు, ఇతరత్రా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 15 నుంచే జిల్లా వ్యాప్తంగా 25 మంది వరకు వడదెబ్బతో మృతిచెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు కూడా కొందరు చనిపోయారు. ఇప్పటివరకు 40 మంది వరకు వడదెబ్బతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలూ చేపట్టకపోవడంతో వడదెబ్బ మరణాలు కొనసాగుతున్నాయి. మే నెలలో కూడా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రజల ఆందోళన రెట్టింపవుతోంది.
వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు
వేసవిలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, కళింగర, కర్భూజా లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలకు మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపోథలామస్) దెబ్బతిని ప్రాణాంతకమైన వడదెబ్బకు గురవుతారు. శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం, లేదంటే శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం వల్ల వడదెబ్బ తగులుతుంది. శరీరం ఎక్కువ వేడికి గురికావడం వల్ల చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, లేదంటే శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం, అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల్లో ఎక్కువ సమయం పనిచేయడం వల్ల వడదెబ్బ బారిన పడతారు. 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, పాలిచ్చేతల్లులు, పసిపిల్లలు, గుండెజబ్బులు, బీపీ, షుగర్ లాంటి వాటితో బాధ పడుతున్న వారు, అనారోగ్యంతో ఉన్న వారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. విపరీతమైన తలనొప్పి, తలతిరగడం, తీవ్ర జ్వరం, మగత నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వడదెబ్బ నివారణకు సూచనలు
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట ప్రాంతాల్లో శారీరక శ్రమతో కూడిన పనులు చేయకపోవడమే మేలు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ సోకినట్లు గమనించిన వెంటనే త్వరగా నీడ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఐస్‌నీటిలో ముంచిన తడిగుడ్డతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేదాకా శరీరం తుడవాలి. ఫ్యాన్ లేదా చల్లటి గాలి కల్పించాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్‌ఎస్) తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న వారికి నీరు తాపించకూడదు. వీలయినంత త్వరగా వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించాలి.
ఉష్ణోగ్రతల వివరాలు:
శింగనమల 45.8 డిగ్రీలు
తాడిపత్రి 44.6
తాడిమర్రి 44.4
కూడేరు 44.4
పుట్లూరు 44.2
పామిడి 44.2
యల్లనూరు 43.9
గుత్తి 43.5
గుంతకల్లు 42.9
పుట్టపర్తి 42.2
ధర్మవరం 42.2
ఉరవకొండ 42.1
అనంతపురం 42.0
కదిరి 41.7
కళ్యాణదుర్గం 41.4
పెనుకొండ 40.5
Advertisement
Advertisement