ఉల్లిరైతు కన్నీరు తుడిచేందుకు ‘మద్దతు’
ఉల్లిరైతు కన్నీరు తుడిచేందుకు ‘మద్దతు’
Published Fri, Oct 14 2016 11:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసువాలి
- సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్నాం
- ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకోరాదనే ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం రూ.600 మద్దతు ధర ప్రకటించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మార్కెట్‌కు రైతుల తగిన నాణ్యతతో తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. శుక్రవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లికి మద్దతు ధర ఇచ్చే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 25 వేల హెక్టార్లలో ఉల్లి సాగు అయిందని, గతంలో ఎపుడూ లేని విధంగా ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి మద్దతు ధర రూ.600గా నిర్ణయించామన్నారు. ఈ అవకాశం కేవలం కర్నూలు జిల్లా రైతులకు మాత్రమే రావడం విశేషమన్నారు.సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమ్మకున్న రైతులకు కూడా మద్దతు ధర లభిస్తుందన్నారు.
కలెక్టర్ ఇక్కడే ఎమ్మెల్యే అయి మంత్రి అవుతారేమో: టీజీ
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బాగా పనిచేస్తున్నారని, ఆయన ఇక్కడే ఎమ్మెల్యే అయి మంత్రి అవుతారేమోనని ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతును ప్రతి రైతుకు అమలు చేయాలన్నారు. ఉల్లి రైతులకు మద్దతు ఇవ్వడంలో ఎటువంటి అక్రమాలకు తావు ఉండరాదని అన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ఉల్లి నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారితో పాటు ఏడీఎం, ఉద్యాన అధికారులను అందులో నియమిస్తామన్నారు. మార్కెట్‌లో నాణ్యతను బట్టి ధర రూ.80 లభించినా, 200 లభించిన రైతులకు ప్రభుత్వం నుంచి రూ.300 లభిస్తుందని వివరించారు. దీనిని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని వివరించారు. కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జేసీ హరికిరణ్ మాట్లాడుతూ...హెక్టారు ఉల్లి ఎన్ని టన్నులు వస్తుందో అంచనా వేశామని అంత వరకు మద్దతు ఇస్తామని వివరించారు. కర్నూలు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు ఎసీ్వ మోహన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, ఏడీఎం సత్యనారాయణచౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడు, డోన్ ఇన్‌చార్జి కేఇ ప్రతాప్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి నారాయణమూర్తి , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుకు దేహశుద్ధి :
జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో ఓ రైతు తమ ఆందోళనను వివరించేందుకు ప్రయత్నించాడు. దీనిని సహించలేక అధికారులు రైతును తాగుబోతుగా ముద్ర వేసి పోలీసులకు తగిన సూచనలు ఇచ్చారు. పోలీసులు రైతును లాక్కెళి్ల లాఠీలతో చితకబాదారు.
Advertisement
Advertisement