పాపం తమ్ముళ్లు !
►అందని ద్రాక్షగా మారిన నామినేటెడ్ పదవులు
► ఏళ్లు గడుస్తున్నా దక్కని అవకాశాలు
► నాయకత్వం తీరుపై ఆశావహుల అసంతృప్తి
► యూజ్ త్రో పాలసీని అనుసరిస్తున్నారని ఆవేదన
► జరుగుతున్న జాప్యంపై హెచ్చరికల సంకేతాలు
♦‘ పోటీ చేస్తే గెలుస్తావో, గెలవో తెలీదు. పోటీ నుంచి తప్పుకుంటే డబ్బులు మిగులుతాయి. కష్టపడి పనిచేయ్. అధికారం వస్తే నామినేటేడ్ పదవి ఇస్తుంది.’ ఎన్నికలకు ముందు ఓ ఆశావహుడికి కీలక నేతల బుజ్జగింపు హామీ.
♦ ‘టిక్కెట్ రాలేదని అసంతృప్తి వద్దు. రెబెల్‌గా పోటీ చేస్తే ఏం వస్తుంది. అధికారంలోకి వస్తే నామినేటేడ్ పదవి ఇస్తాం. పార్టీ పెద్ద దిక్కుగా ఇస్తున్న హామీ ఇది.’ టికెట్‌రాక ఇండిపెండెంట్‌గా దిగుతామన్నవారికి బుజ్జగించిన తీరిది.
♦ ‘కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి వస్తుంది. నా గెలుపునకు కృషి చేసావని పట్టుబడి నామినేటేడ్ పదవి ఇప్పిస్తా. అవసరమైతే అధిష్టానంతో పొట్లాడుతా.’ ఓ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేత ఇచ్చిన హామీ ఇది.
♦ ఇప్పుడు వారంతా కరివేపాకుల్లా కనిపిస్తున్నారు. పదవులకోసం పాకులాడే స్వార్థపరులుగా ముద్రపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు వారినుంచి ముడుపులు గుంజేస్తున్నారు. ఇలా మోసపోయినవారు ముగ్గురు ఇప్పుడు ఆవేదనతో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలంటే కిందివారికి కొండంత పని. జెండాలు మోయాలి. ప్రచారానికి కార్యకర్తలను తరలించాలి. వీధుల్లోకి వెళ్లి జనాన్ని సేకరించాలి. ఇవన్నీ చేసేది ఆ కొద్దిరోజుల్లో ఎంతోకొంత మొత్తం వస్తుందన్న ఆశతో కాదు. భవిష్యత్తులో ఆ నాయకుడివల్ల ఏదో పదవి రాకపోతుందా... తమకంటూ ఓ గుర్తింపు రాకపోతుందా... అన్న కోరికతో. కొందరైతే చేతి చమురూ వదిలించుకున్నవారూ లేకపోలేదు. అవకాశం వచ్చినపుడు తమ మనసులోమాట సదరు నేత చెవిలో వేస్తే ఆయన కూడా ఏమాత్రం కాదనకుండా హామీ ఇచ్చేస్తారు. ఇలా ఎంతోమంది కార్యకర్తలు ఆశావహుల జాబితాలో చేరారు. ఇప్పుడు వారికి నామినేటెడ్ పోస్టు దక్కకపోవడంతో ఆవేదనతో మండిపడుతున్నారు.
అధికారానిక వచ్చినా... : ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు అధికారాన్ని వెలగబెడుతున్నారు. ఆయన గెలుపుకోసం అహర్నిశలూ పనిచేసినవారు ఇప్పుడు ఆయన కరుణకోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఇదీ వారిని తీవ్రంగా కలచివేస్తున్న అంశం. జిల్లాలో ఇంకా భర్తీకాని పదవులెన్నో ఉన్నాయి. అప్పుడే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. కానీ తమకు అవకాశాలు కల్పించడంలో మాత్రం చొరవ చూపడంలేదు.
హామీలు పొందినవారెందరో... : రాష్ట్ర స్థాయి నామినేటేడ్ పోస్టులపై దాదాపు 10మంది ఆశలు పెట్టుకున్నారు.ఆర్టీసీ, మైనింగ్, ఖాదీబోర్డు, ఎస్టీ కమిషన్ తదితర 15రకాల చైర్మన్ పోస్టుల కోసం కళ్లకు ఒత్తులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో శోభా హైమావతి, కె.త్రిమూర్తుల రాజు, తెంటు లక్ష్ముంనాయుడు, ఐ.వి.పి.రాజు, భంజ్‌దేవ్, గద్దే బాబూరావు, తూముల భాస్కరరావు, డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ ఉన్నారు. జిల్లా స్థాయి పదవుల కోసం గొట్టాపు వెంకటనాయుడు, కడగల ఆనందకుమార్, రావెల శ్రీధర్, ఎస్.ఎన్.ఎం.రాజు తదితరులు ఎదురు చూస్తున్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం 15మంది పోటీ పడుతున్నారు. వుడా డెరైక్టర్ పదవికి నలుగురు నిరీక్షిస్తున్నారు. అలాగే, పశు గణాభివృద్ధి సంస్థ కమిటీ, ఎస్సీ, ఎస్టీ అడ్వయిజరీ కమిటీ, బీసీ సొసైటీ, ఫుడ్ కమిటీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ థర్డ్ కమిటీ సభ్యత్వం, టెలికం జిల్లా అడ్వయిజరీ, ఆర్టీఓ అడ్వయిజరీ, స్టేట్ టెలికం అడ్వయిజరీ కమిటీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారు. డీఆర్‌డీఏలో ఉన్న నామినేటెడ్ పోస్టులతో పాటు దేవస్థానం కమిటీ చైర్మన్ పోస్టులపై కూడా లెక్కకు మించి నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
అయినా వారికి చల్లని కబురు రావడం లేదు. అసలు భర్తీ చేస్తారో లేదో అన్న అభద్రతా భావానికి వెళ్లిపోయారు. ‘మమ్మల్ని వాడుకున్నారు. ఇప్పుడు వదిలేసారు. వాళ్లకి పదవులు ఉన్నాయి. మేము ఏమైపోతే వారికేంటి? వాళ్లు సంతోషంగా ఉండే చాలనే దోరణితో తమ నేతలు ఉన్నారని కొందరు ఆశావహులగా బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని, ఎన్నికలు వస్తే బుద్ధి చెబుతామంటూ కొందరు అంతర్గతంగా హెచ్చరికలు కూడా పంపిస్తున్నారు.