పుట్టా అనుచరుడా.. మజాకా!
► రైతు సంఘంలో ఉన్నట్లు మోసం
► ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ సబ్సిడీ కింద
ట్రాక్టర్ తీసుకున్న టీడీపీ నాయకుడు
► కేసు నమోదు చేయాలంటున్న బాధితులు
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నాయకుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ఓ టీడీపీ నాయకుడు ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...చాపాడు మండలంలోని రాజుపాళెంకు చెందిన టీడీపీ నాయకుడు పల్లెం శ్రీనివాసులు ఓ రైతు కుటుంబం నుంచి పట్టాదారు పాసుబుక్, రేషన్, ఆధార్ కార్డులు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. దీనిపై అధికారులు కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధిత మహిళ జాకట జ్యోతి తెలిపారు.
పల్లెం శ్రీనివాసులు మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ పుట్టా సుధాకర్‌యాదవ్ ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. గతేడాది కురిసిన అకాల వర్షాలకు రాజుపాళెంకు చెందిన జాకట స్వామిదానం, జ్యోతిలకు చెందిన వరి, మినుము పంట దెబ్బతింది. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పల్లెం శ్రీనివాసులు అప్పట్లో పంటకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి జ్యోతి పేరుతో ఉన్న 1.26 ఎకరాల పట్టాదారు పాసుబుక్, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ పత్రాలను ఇప్పించుకున్నాడు.
దీనికి ముందే రాజుపాళెంలో శ్రీవెంకటేశ్వర రైతు మిత్ర సంఘం సృష్టించి రూ.6 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ను రూ.3లక్షల సబ్సిడీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనివాసులు పొందాడు. ఈ గ్రూపులో జాకట జ్యోతి సభ్యురాలు. శ్రీనివాసులు బంధువులైన పి.గంగన్న, ఎం.రామసుబ్బయ్య, ఎం.గోపాల్, ఎం.పెద్దబాలయ్యల పేర్లతో సబ్సీడీ కింద ట్రాక్టర్ పొందినట్లు విషయం తెలుసుకున్న జ్యోతి దంపతులు అవాక్కయ్యారు. తాను ఎలాంటి సంతకాలు పెట్టలేదని, పంట నష్ట పరిహారం కోసం శ్రీనివాసులుకు భూమి, ఆధార్, రేషన్‌కార్డుల పత్రాలు ఇచ్చామని, తన సంతకాలను ఫోర్జరీ చేశాడని విచారం వ్యక్తం చేశారు. కనీసం వ్యవసాయాధికారులు కూడా విషయం తమకు తెలుపలేదని వాపోయారు.
ఎస్సీ, ఎస్టీ, 420 కేసులు నమోదు చేయాలి
దళితులమైన తమను నమ్మించి తమ పత్రాలను తీసుకుని, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద ట్రాక్టర్ పొందిన పల్లెం శ్రీనివాసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 కేసు నమోదు చేయాలని దళిత దంపతులు స్వామినాథం, జ్యోతిలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
అన్ని రకాలైన పత్రాలు ఉండటంతో మంజూరు
ఈ ఘటనపై మండల వ్యవసాయాధికారి సురేష్‌బాబును వివరణ కోరగా శ్రీవెంకటేశ్వర రైతు మిత్రం సంఘం పేరుతో అన్ని రకాలైన ఆధార పత్రాలు, సంతకాలు ఉండటంతో ట్రాక్టర్ మంజూరైందని తెలిపారు.