రూపాయికి కిలో బియ్యం శుద్ధ దండగ :జేసీ
రాయదుర్గం: రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న రూపాయికి కిలో బియ్యం శుద్ధ దండగ అని, రైతులకు ఒకేసారి రూ.5వేల రుణమాఫీ చేసి ఉంటే బాగుండేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాయదుర్గం మండలం కాశీపురం, వేపరాల, బీఎన్‌హళ్లి, వడ్రహొన్నూరు, 74 ఉడేగోళం గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన మొక్కల పెంపకం, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ జేసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ)కి ఇప్ప ట్లో నీరు తీసుకురావడం కష్టమని చెప్పారు.
రాష్ట్రం విడిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, బీటీపీకి కృష్ణా జలాలు తీసుకురావడం వ్యయప్రయాసలతో కూడుకున్నదన్నారు. నీరు తెచ్చేందుకు మరో నాలుగైదేళ్లు పడుతుందన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ రేషన్ డీలర్లు తూకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సంతోషంగా ఉండాలన్నారు.