తీసుకున్నందుకు తలబొప్పి!
♦ చంద్రబాబు నిర్వాకంపై విమర్శల వెల్లువ
♦ పార్టీ అన్నాక విలువలు పాటించాలనే అభిప్రాయం
♦ చెప్పిన సుద్దులు బాబు మరిచిపోయారా అంటూ ఎద్దేవా
♦ తెలుగుదేశం పార్టీలోనూ రగులుతున్న అసంతృప్తి
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : అష్టకష్టాలు పడీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఐదుగురు ప్రజా ప్రతినిధులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఆనందం అప్పుడే ఆవిరైపోతోంది. చంద్రబాబు, చినబాబు లోకేశ్‌లు గత కొద్దికాలంగా నిత్యం మంతనాలు సాగించి, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి పదవులు ఇవ్వడానికి, అడిగినంత నగదు అందజేయడానికి, గనులు, కాంట్రాక్టు పనులు కట్టబెట్టడానికి, కేసులు తదితరాలు ఎత్తివేయడానికి ప్రభుత్వాధినేత సిద్ధం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దిగజారుడు రాజకీయాలపై మిత్రపక్షమైన బీజేపీ సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
‘ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కొన్ని విలువలున్నాయి. వాటిని ఏ పార్టీ అయినా పాటించాలి..’ అంటూ చంద్రబాబు వైఖరిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుబట్టారు. టీడీపీ తరహాలో తమ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ వారిని చంద్రబాబు దుమ్మెత్తిపోయడం, మూడు వారాలు కూడా తిరక్కుండానే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ..‘సత్య హరిశ్చంద్రా.. ఇప్పుడేమంటావ్?’ అంటూ చంద్రబాబును నిలదీయడం టీడీపీ వర్గాల్లో సైతం చర్చకు తెరతీసింది.
అధినేత వైఖరితో తలసాని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ సీనియర్లు పలువురు వాపోతున్నారు. వచ్చిన ఆ ఐదుగురితో పోయేదే తప్ప ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. చేరికలపై స్వపక్షంలో అసంతృప్తి, అన్నివైపుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు, సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు చూస్తుంటే.. చంద్రబాబు కోరి మరీ తలనొప్పి తెచ్చుకున్నారనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లోనే వినిపిస్తోంది.
అంత ఆగత్యం ఏమొచ్చింది?
‘పార్టీకి తక్షణ ఇబ్బందులు కనిపించకపోయినా నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా ఫిరాయింపుల ప్రోత్సాహకునిగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది?’ అని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘పార్టీని ఎంతోకాలంగా నమ్ముకుని ఉన్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన వారున్నారు. ఎమ్మెల్సీ తదితర పదవులకు అర్హులు మరెందరో ఉన్నారు. వారందరినీ వదిలేసి ఇతర పార్టీల వారిని అక్కునచేర్చుకుని పదవులు కట్టబెడతామనే హామీలు ఇవ్వాల్సిన పనేముంది?’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
‘మొన్నటి ఎన్నికలకు రూ.20 కోట్లు ఖర్చయ్యింది. నెలకు కనీసం వడ్డీ కూడా రావడంలేదు. ఇసుక వ్యాపారం చేసుకుందామనుకున్నా కుదరడంలేదు. అంతోఇంతో చేసుకున్నా వచ్చిన దాంట్లో చినబాబుకు తప్పనిసరిగా వాటా పంపాలి. లేదంటే మాపై అవినీతి ముద్ర వేసేస్తారు. పోలీసులనైనా ఉసిగొల్పుతారు. ఏం మావి డబ్బులు కావా? పదవులకు మేం అర్హులం కామా?’ అని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేశారు.
‘కడప, కర్నూలు జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు పార్టీ అధినేతకు తెలియవా? శిల్పా, పేర్ల వర్గాలు వద్దంటున్నా భూమా నాగిరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డిలను పార్టీలో ఎలా చేర్చుకుంటారు..’ అని సీమ జిల్లాలకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. భూమా, దేవగుడిలకు ఇవ్వదలచుకుంటున్న పదవులేవో మాకే ఇస్తే ఇక్కడ మేం బలపడమా?’ అని వాపోతున్నారు.
‘పేర్ల శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ కన్నీటిపర్యంతమయ్యారంటే ఆమె ఎంత ఆవేదనకు లోనై ఉంటారో చంద్రబాబు గుర్తించలేరా?’ అని జమ్మలమడుగు నియోజకవర్గం సీనియర్ నేత ప్రశ్నించారు. జలీల్‌ఖాన్‌ను తీసుకునే విషయంలో తమను సంప్రదించకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అక్కడి బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ బహిరంగంగానే ప్రశ్నలు సంధించడం గమనార్హం.