ప్రకాష్‌గౌడ్ జంప్
♦ ఎర్రబెల్లితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
♦ త్వరలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని వెల్లడి
♦ అయోమయంలో తెలుగు తమ్ముళ్లు
అంతా ఊహించినట్లే జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ గులాబీ గూటికి చేరారు. అనుచరులు, కార్యకర్తలతో రెండ్రోజులుగా సమాలోచనలు చేస్తున్న ఆయన.. టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లినప్పటికీ త్వరలో బహిరంగసభ ఏర్పాటు చేసి అధికారికంగా చేరనున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీకి సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రకాష్‌గౌడ్ టీఆర్‌ఎస్ గూటికి చేరడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. సారథులంతా అధికారపార్టీలో చేరిపోతే తమ పరిస్థితి ఏమిటనే సందిగ్ధంలో ఉన్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెలేలతో అత్తెసరు మెజార్టీ ఉన్న ఆ పార్టీకి ఇప్పుడు రెండింతలు బలం పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు యాదయ్య, యాదవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగా.. టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గులాబీ గూటికి చేరారు. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్ సైతం అధికారపార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో సంఖ్యా పరంగా జిల్లాలో టీఆర్‌ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది.
ఇదేబాటలో ‘గాంధీ’..!
ప్రస్తుతం జిల్లాలో టీడీపీ తరఫున శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాాంధీ, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రమే ఉన్నారు. గాంధీ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఆయన మాత్రం చేరికను ఖండించారు. తాజాగా ప్రకాష్‌గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇక ఆయన వంతే మిగిలిఉందని రాజకీయ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇదేక్రమంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును గాంధీ కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో గాంధీ గులాబీ కండువా వేసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.