టీడీపీ దుకాణం బంద్‌! | tdp lossing ground in telangana | Sakshi
Sakshi News home page

టీడీపీ దుకాణం బంద్‌!

Published Wed, Feb 10 2016 7:54 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

టీడీపీ దుకాణం బంద్‌! - Sakshi

టీడీపీ దుకాణం బంద్‌!

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందా? టీడీపీ ఇక ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కానుందా? అంటే తాజా పరిణామాలు, ఆగని వలసలు ఔననే సూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. 2014 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, ఆ తదనంతరం వేగంగా చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణలో టీడీపీని ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. ఒకరి వెంట ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు ఇలా పూర్తిగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతుండటంతో తెలంగాణలో ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. తాజాగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఇక తెలంగాణలో టీడీపీ కోలుకోలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి. దీనికితోడు తాజాగా టీ టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, గ్రేటర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్దమవ్వడంతో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. టీడీపీకి తెలంగాణలో అగ్రనాయకుల్లో ఒకరైన ఎర్రబెల్లి కూడా పార్టీకి రాజీనామా చేసి.. తన భవిష్యత్తు తాను చూసుకోవడంతో సైకిల్‌ పార్టీకి దిక్కతోచని పరిస్థితి నెలకొంది.  

2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది మొదలు సైకిల్‌ నుంచి కారులోకి వలసలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 ఎమ్మెల్యేలు గెలుపొందగా.. ఇప్పటికే ఏడుగురు కారు ఎక్కారు. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్‌ గౌడ్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఆ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు రెండింట మూడొంతుల మంది కారెక్కినట్టయింది. ఈ నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్షాన్ని పూర్తిగా టీఆర్ఎస్‌లోకి విలీనం చేసుకోవడం ద్వారా పార్టీ మారిన సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా గులాబీ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

టీడీపీ కనుమరుగు!
టీడీపీని దెబ్బతీయడంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహం బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటినుంచి టీఆర్‌ఎస్‌లోకి టీడీపీ నేతలు వలసలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వలసలను అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. నేతలు మాత్రం ఒకరి వెంట ఒకరి క్యూ కట్టుకొని కారు ఎక్కుతున్నారు. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఈ వలసలు తారాస్థాయికి చేరాయి. టీడీపీలో బలమైన సీనియర్ నేతగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఎర్రబెల్లి సైతం సైకిల్ ను వీడి కారు ఎక్కుతుండటంతో తెలంగాణలో ఈ పచ్చపార్టీ వేగంగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీ టీడీపీలో సీనియర్ నేతలైన ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు, రేవంత్‌రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎల్ రమణకు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై కూడా ఎర్రబెల్లి గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు చెప్తున్నారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తనకు ఇవ్వకపోవడం కూడా ఎర్రబెల్లి పార్టీ వీడటానికి  కారణమని వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ప్రకాశ్‌ గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమవ్వగా.. మరో గ్రేటర్ ఎమ్మెల్యే కూడా కారు ఎక్కునున్నారని సమాచారం అందుతోంది.

ఈ నేపథ్యంలో టీటీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిలాంటి ఒకరిద్దరు నేతలు మినహా.. చెప్పుకోదగ్గ నాయకత్వంగానీ, కార్యకర్తల బలంగానీ తెలంగాణలో ఉండబోదని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండటంతో నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లోనూ టీటీడీపీ పూర్తిగా డీలాపడిపోయిందని, ఏదో నామ్‌కే వాస్తే అన్నట్టుగా రేవంత్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు అక్కడ ప్రచారం నిర్వహించారు కానీ, ఎవరూ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకోలేదని తెలంగాణ టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటివరకు వివేకానంద (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీపట్నం), చల్లా ధర్మారెడ్డి (పరకాల), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), సాయన్న (కంటోన్మెంట్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), ప్రకాశ్‌ గౌడ్ (రాజేంద్రనగర్), ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకూర్తి) టీఆర్‌ఎస్‌లో చేరిన, చేరుతున్న వారు కాగా.. ఇంకా టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ (శేర్‌లింగంపల్లి), కృష్ణయ్య (ఎల్బీనగర్), మాగంటి గోపి (జుబ్లీహిల్స్), రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), సండ్ర వేంకట వీరయ్య (సత్తుపల్లి)..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement