ముగిసిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు
- బాలికల్లో ‘అనంత’.. బాలురలో ‘ప్రకాశం’
గుంతకల్లు : పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో అనంతపురం, బాలుర విభాగంలో ప్రకాశం జిల్లాల క్రీడాకారులు విజయ దుందుబి మోగించారు. సోమవారం ఉదయం బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు గుంటూరుపైన, చిత్తూరు జట్టు విజయనగరంపైనా గెలుపొంది ఫైనల్‌కు చేరాయి. మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జట్టు చిత్తూరు జట్టుపై గెలుపొంది టోర్నీ విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజయనగరంపైన, చిత్తూరు జట్టు ప్రకాశంపైన గెలుపొంది ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో అనంతపురం జట్టు చిత్తూరుపై విజయ కేతనం ఎగురవేసి టోర్నీ విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జట్టు, బాలికల విభాగంలో అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గుంతకల్లు డీఎస్పీ సీహెచ్.రవికుమార్, మార్కెట్‌యార్డు చైర్మన్ బండారు ఆనంద్ బహుమతులు, షీల్డులు అందజేసి విజేతలను అభినందించారు. సెలక్షన్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, జిల్లా ఖోఖో క్రీడా సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముక్కన్నగారి రామాంజినేయులు, ఆర్గనైజర్లు శ్రీనివాసులు, మల్లికార్జున, సత్యనారాయణ, ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఖోఖో బాల బాలికల జట్లు ఎంపిక : ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారితో అండర్-14 ఖోఖో బాలబాలికల రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు సెలక‌్షన్ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు.
బాలికల జట్టు : కవిత, వరలక్ష్మి, రుబినా(అనంతపురం), అఖిల, శిరీష(ప్రకాశం), శారద(కర్నూలు), అమృత(తూర్పు గోదావరి), శరణి (కడప), యశోద(నెల్లూరు), పూజిత, అనూష, కుమారి(చిత్తూరు).
బాలుర జట్టు : బాండ్‌రాజ్, సందీప్(ప్రకాశం), శశాంక్, నీరజ్‌రాఘవ్, సింహాద్రి(చిత్తూరు), ప్రవీణ్ (తూర్పు గోదావరి), సాయికృష్ణ(అనంతపురం), సాయినాయక్(గుంటూరు), భానుప్రసాద్(విజయనగరం), మదన్‌మోహన్‌రావు(కడప), సురేంద్ర(విశాఖ), కరణ్(నెల్లూరు).