కామారెడ్డి జిల్లా ఏర్పాటు వేగవంతం
-
ఏర్పాట్లను పరిశీలించి జేసీ రవీందర్‌రెడ్డి
కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డిలో జిల్లా కలెక్టరేట్ సముదాయం కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపిక చేశారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి కలెక్టరేట్ భవనంలోని ఆయా గదులను పరిశీలించారు. అనంతరం వివిధ విభాగాలకు సంబంధించి గదులను ఖరారు చేశారు. మైనార్టీ పాఠశాల భవనంలోని రెండంతస్తుల్లోని భవనంతో పాటు హాస్టల్ భవనం, డైనింగ్ హాల్‌లను సైతం కలెక్టరేట్ కార్యాలయాల కోసం కేటాయించారు. ప్రధాన భవనంలో కలెక్టర్ చాంబర్, వివిధ ముఖ్య విభాగాల కార్యాలయాలు ఉంటాయి. మొదటి అంతస్తులో వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించారు. మొత్తం 60 శాఖలకు సంబంధించి కార్యాలయాలు అవసరం ఉండగా ప్రస్తుతం కలెక్టరేట్‌లో కలెక్టర్ చాంబర్, సంక్షేమశాఖలు, రెవెన్యూ, పరిపాలన తదితర విభాగాలకు గదులను కేటాయించారు. జిల్లా పరిషత్‌పై స్పష్టత లేకపోవడంతో పంచాయతీరాజ్‌కు సంబంధించి కార్యాలయాలకు గదులను కేటాయించలేదు. కాగా ఆయా భవనాల్లో చేపట్టాల్సిన చిన్నచిన్న మార్పుల గురించి జేసీ అధికారులకు సూచనలు చేశారు. జేసీ వెంట డీఆర్‌వో పద్మాకర్, ఆర్డీవో నగేష్, తహసీల్దార్ రవీందర్, ఆర్‌వీఎం ఈఈ కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.
కార్యాలయాల కోసం గదులను ఎంపిక చేశాం
– జేసీ రవీందర్‌రెడ్డి
కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన భవనంలో ఆయా విభాగాలకు సంబంధించి గదులను కేటాయించామని జేసీ రవీందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ భవనంలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ దసరా నుంచి కొత్త జిల్లాలు అమలులోకి రానున్నందున కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పనులు చేపడుతున్నామని తెలిపారు.