రౌడీషీటర్లలో గుబులు
-
భూదందాలు, సెటిల్‌మెంట్లపై పోలీసుల దృష్టి
-
మాఫియా కదలికలపై నిఘా
-
ఆరు నెలల్లో అరికడతామన్న ఏఎస్పీ
గోదావరిఖని : గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌తో కోల్‌బెల్ట్ ప్రాంతంలోని రౌడీషీటర్లలో గుబులు మొదలైంది. భూదందాలు చేస్తూ కోట్లకు పడగలెత్తిన నయీమ్ చివరకు పోలీసుల చేతిలోనే హతమవడం గమనార్హం. గోదావరిఖనిలో 2012లో కట్టెకోల సుధీర్ అనే రౌడీషీటర్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఈ సంఘటన తర్వాత రౌడీషీటర్ల ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. అయితే జిల్లాలోనే అతి ఎక్కువగా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 47 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వారిలో 25 మంది పలు దందాలను కొనసాగిస్తున్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇటీవల గోదావరిఖని మార్కండేయకాలనీ, అడ్డగుంటపల్లితోపాటు పలు ప్రాంతాల్లోని ప్రైవేటు పట్టా భూములపై రౌడీషీటర్లు కన్నేసి సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఈ భూదందాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో భూదందాలను అరికడతామని ప్రకటించారు. నÄæూమ్‌కు కోల్‌బెల్ట్ ప్రాంతాలైన గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లిలోనూ అనుచరులున్నారు. మంచిర్యాల కొత్త జిల్లా కావడం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడపడం, గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారే ఇక్కడ ఎక్కువగా భూములు కొనుగోలు చేయడం, అమ్మడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో నయీమ్ ముఠా సభ్యులు ఇక్కడి భూముల దందాలో కూడా ప్రవేశించినట్టు సమాచారం. రెండు నెలల క్రితం నయీమ్ ముఠా సభ్యుడు, ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడంతో ఆయన గోదావరిఖనికి వచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. కానీ అంతకుముందు కూడా ఆయన, ఆయన అనుచరులు మంచిర్యాల, గోదావరిఖనితోపాటు మంథని ఏరియాలో కూడా తిరుగుతూ సెటిల్‌మెంట్లు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరిఖనికి చెందిన కొందరు రౌడీషీటర్లు పలు కేసులలో జైళ్లలో మగ్గుతుండగా... మరికొందరు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. మాట వినని వారిని బెదిరింపులకు గురిచేస్తున్న క్రమంలో బాధితులు ఎవరికి చెప్పుకోలేని స్థితి ఏర్పడింది.
అయితే పలువులు బాధితులు మాత్రం నేరుగా తమకు జరుగుతున్న అన్యాయంపై స్వయంగా ఏఎస్పీని ఆశ్రయిస్తుండగా... ఆయన సదరు రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిసింది. ఒకవేళ ఎవరైనా రౌడీషీటర్ భూదందాలు, సెటిల్‌మెంట్లలో భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తిస్తే తమదైన శైలీలో వారికి బుద్ధి చెప్పేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తాజాగా నయీమ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో స్థానిక రౌడీషీటర్లు తమకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. నయీమ్ ఎన్‌కౌంటర్ స్థానిక రౌడీషీటర్లకు గుణపాఠం కావాలని కోల్‌బెల్ట్ వాసులు కోరుకుంటున్నారు.