నిజామాబాద్ జిల్లా యెడపల్లి మండలం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు కోనేరులో పడి మృతి చెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఆదివారం సాయంత్రం ఆలయానికి వచ్చింది.
స్వామి దర్శనం అనంతరం రాజమ్మ (50) తన ఇద్దరు మనవళ్లు నవతేజ (10), అరుణ్(10)తో కలసి కోనేరు దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒకరు కోనేరులో దిగి మునిగిపోతుండగా మరో బాలుడు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. అతడు కూడా నీటిలో పడిపోవడంతో వారిని రక్షించేందుకు వెళ్లిన రాజమ్మ కూడా కోనేరులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 9 గంటల తర్వాత మృతదేహాలను వెలికి తీయించిన పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.