ఇదీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ తీరు
♦ మొత్తం డివిజన్లు 50
♦ పోలైన ఓట్లు 1,79,827
♦ పోలింగ్ కేంద్రాలు 265
♦ బరిలో ఉన్న అభ్యర్థులు 291
♦ లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు 20
♦ ప్రక్రియలో పాల్గొనే అధికారులు 100మంది
ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11గంటలలోపు తుది ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నా రు. మొత్తం 3 రౌండ్లుగా విభజించి.. ఒక్కో రౌండ్‌కు గంట చొప్పున సమయం కేటాయించి.. ఫలితాలు మూడు గంటల వ్యవధిలో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల బరిలో నిలబడి పోటాపోటీగా ప్రచా రం నిర్వహించిన అభ్యర్థుల్లో కౌంటింగ్ ప్రక్రి య ప్రారంభమవుతుండటంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది.
తొలుత అన్ని రాజకీయ పార్టీ ల నాయకుల సమక్షంలో పత్తి మార్కెట్‌లోని స్ట్రాంగ్‌రూమ్ సీల్ తీసి ఈవీఎంలను బయటకు తీసుకొస్తారు. ఉదయం 8గంటలకు ఈవీఎంలు ఉంచిన టేబుళ్ల వద్దకు అభ్యర్థులు లేదా వారి తరపున ఒక ఏజెంట్‌ను గాని పిలిచి పోస్టల్ బ్యాలెట్ లెక్కించి పార్టీల వారీగా నమోదు చేసుకుంటారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేసి పోలింగ్‌స్టేషన్ల వారీగా రాజకీయ పార్టీలకు పడిన ఓట్లను నమోదు చేసుకుంటారు. అన్ని పోలింగ్‌స్టేషన్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.
పత్తి మార్కెట్‌లో...
♦ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లను 3 రౌం డ్లుగా విభజించి.. 3 గంటల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్‌లో లెక్కింపు కోసం 20 కౌంట ర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్‌లో నలుగురు జిల్లాస్థాయి అధికారులను నియమించారు.
♦ ఒకటి నుంచి 20వ డివిజన్ వరకు తొలి విడతగా తీసుకుని ఒక్కో కౌంటర్ వద్ద డివిజన్‌లోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను ఉంచుతారు. ఇలా 20 కౌంటర్లలో 20 డివిజన్లకు సంబంధించిన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
♦ 2వ రౌండ్‌గా 21వ డివిజన్ నుంచి 40వ డివిజన్ వరకు ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
♦ 3వ రౌండ్‌లో 41 నుంచి 50 డివిజన్ వరకు ఈవీఎంలను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఉదయం 8గంటల నుంచి ప్రారంభమై 11గంటల వరకు పూర్తి చేస్తారు.
అర్థగంటలోనే ఆ ఆరు డివిజన్ల ఫలితాలు..
♦ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అర్థగంటలోనే తక్కువ పోలింగ్‌స్టేషన్లు ఉన్న డివిజన్ల ఫలితాలు వెల్లడించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వీటిలో నాలుగే పోలింగ్ కేంద్రాలున్న 1, 5, 15, 16, 18, 20 డివిజన్ల ఫలితాలు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి.
♦ అభ్యర్థి లేదా.. అతడి తరఫు ఏజెంట్‌కే అనుమతి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థి లేదా అతడి తరఫున ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు.