
శ్రీవారి సేవలో టీడీపీ నేతలు.. సామాన్యులకు తిప్పలు
తిరుమల కొండకు టీడీపీ నాయకుల రాకతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తిరుమల: తిరుమల కొండకు టీడీపీ నాయకుల రాకతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ మహానాడుకు తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పనిలోపనిగా తిరుమల దర్శనానికి క్యూ కడుతున్నారు. దీంతో తిరుపతిలో, తిరుమలలో భక్తులకు వసతి కరువైంది. శనివారం హోంమంత్రి చిన్నరాజప్పతోపాటు మంత్రులు అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ఎంపీలు నాని, మురళీమోహన్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
వేసవి సెలవులు ముగుస్తుండడం, త్వరలో పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి 30 గంటలు, నడకదారి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోగా... బయట కూడా బారులు తీరారు. దీంతో వెలుపల ఉన్న భక్తులను మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కూర్చోబెట్టారు.