శ్రీవారికి సుదీర్ఘ విరామం
తిరుమల: సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం రాత్రి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 5.47 గంటల నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. ఆలయ నిబంధనల ప్రకారం గ్రహణ సమయానికి సుమారు 6 గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు.
ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 7.40 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఏకాంత సేవ వైదికంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బంగారువాకిళ్లు, వెండివాకిలి ద్వారాలను టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవోతో పాటు అధికారులు, ఆలయ పూజారులు మహద్వారాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటకు తిరిగి తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సుప్రభాతం ఏకాంతంగా నిర్వహించిన తర్వాత ఉదయం 11 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. నిత్యం గంట కూడా విరామం లేని తిరుమలేశునికి సూర్యగ్రహణం వల్ల సుమారు 13 గంటలపాటు విరామం లభించింది.