- 15న వేరుశనగ పంపిణీ ముగిసే అవకాశం
- కొనసాగనున్న విత్తన కందులు, బహుధాన్యపు కిట్ల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో సోమవారం నుంచి మూడో విడత విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు 4.01 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 5 లక్షల కిట్లు బహుధాన్యపు విత్తనాలు, 6 వేల క్వింటాళ్లు మేర విత్తన కందులు కేటాయించిన విషయం తెలిసిందే. గతనెల 24 నుంచి విత్తన పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు చేపట్టిన తొలి విడతలో 1,46,272 మంది రైతులకు 1,69,327 క్వింటాళ్లు పంపిణీ చేశారు. రెండో విడతగా ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 72,174 మంది రైతులకు 84,166 క్వింటాళ్లు పంపిణీ జరిగింది. మొత్తం 2,18,446 మంది రైతులకు 2,53,493 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కేటాయింపుల మేరకు ఇంకా 1.48 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 6,762 మంది రైతులకు 695 క్వింటాళ్లు కందులు పంపిణీ చేయగా, ఇంకా 53,000 క్వింటాళ్ల కందులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 27,852 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశారు. ఇంకా 4.72 లక్షల కిట్ల పంపిణీ ఎప్పుడో తెలియడం లేదు.
రైతుల నుంచి స్పందన అంతంతమాత్రమే :
ముందస్తు ప్రణాళిక ఉన్నా పంపిణీలో సర్వర్ సమస్యలు, యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో కిట్లు తయారు చేయకపోవడంతో కొంత అంతరాయం ఏర్పడింది. అనుకున్న విధంగా విత్తనాల పంపిణీ జరగలేదని తెలుస్తోంది. సోమవారం నుంచి మూడో విడత చేపట్టనున్నారు. అయితే పంపిణీకి రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటం, రోజుకు 100, 200 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ కోసం పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది కౌంటర్లలో ఉండటం కనిపిస్తుండటంతో విత్తన పంపిణీని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న తుది గడువుగా ప్రకటించి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు విత్తనం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో 3 నుంచి 3.20 లక్షల క్వింటాళ్లు పంపిణీ కావచ్చని అంచనా వేస్తున్నారు. కౌంటర్లు క్లోజ్ చేసిన తర్వాత మండల వ్యవసాయాధికారుల కార్యాలయాల్లోనే విత్తన కందులు, బహుధాన్యపు విత్తనాల కిట్లు పంపిణీ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి మూడో విడత విత్తన పంపిణీ
Published Sun, Jun 11 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM
Advertisement
Advertisement