మొక్కుబడి చర్చ! | today ZP General Meeting is condected poorly | Sakshi
Sakshi News home page

మొక్కుబడి చర్చ!

Published Fri, Jun 17 2016 1:53 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

మొక్కుబడి చర్చ! - Sakshi

మొక్కుబడి చర్చ!

హడావుడిగా సాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం
కీలక అంశాలపై మొక్కుబడి చర్చతో సరిపెట్టిన వైనం
సభ్యులడిగిన ప్రశ్నలకు లభించని సమాధానాలు
పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ జాప్యంపై సభ్యుల ఫైర్
ప్రైవేటు బడులకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్
వైద్య, ఆరోగ్యంపై ప్రజాప్రతినిధుల కస్సుబుస్సు

 ఈ సారి జెడ్పీ సమావేశం చప్పగా సాగింది. అన్ని అంశాలపైనా మొక్కుబడి చర్చే జరిగింది. కీలకాంశాలపై ఎక్కువ సమయం వెచ్చించలేకపోయారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, వైద్య, ఆరోగ్యశాఖలో సమస్యలు, ప్రభుత్వ బడుల్లో సౌకర్యాల లేమి.. తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించినప్పటికీ అధికారులు వాటిపై సరైన సమాధానం చెప్పలేకపోయారు. గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్‌పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘనుందన్‌రావు తదితరులు హాజరయ్యారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా

జెడ్పీటీసీ సభ్యులు స్థాయీ సంఘం మీటింగ్‌లకు హాజరుకావడం లేదు. కేవలం అధికారులే వస్తున్నారు. కోరం కూడా ఉండట్లేదు. ముందు మీ డ్యూటీ సరిగా చేస్తే అధికారులను ప్రశ్నించొచ్చు.  - జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి

ఇకపై ప్రైవేటు స్కూళ్లకు కొత్తగా అనుమతులు ఇవ్వొద్దు.
క్షేత్రస్థాయిలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వాలి. ప్రతి పథకంలోపారదర్శకత ఉండాలి.  - మంత్రి మహేందర్‌రెడ్డి

పాలీహౌస్‌లో సాగు విధానం లాభదాయకం. అయితే ఈ పద్ధతిపై అవగాహన చేసుకుని ముందుకెళ్లాలి. లాభనష్టాలకు రైతులదే బాధ్యత.
- కలెక్టర్ రఘునందన్‌రావు

పాలీహౌస్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. సరైన పద్ధతిలో సాగు చేపట్టకపోవడం వల్లే నష్టాలు. - మంత్రి మహేందర్‌రెడ్డి

 ‘పాలీహౌస్’లపై దుమారం..
పాలీహౌస్ సాగు లాభదాయకమని అధికారులు తప్పుడు సహాలిస్తున్నారని.. వాటిని ఏర్పాటు చేసిన పేద రైతులెవరూ లాభపడలేదని ఎమ్మెల్యేలు యాదయ్య, సంజీవరావు, జెడ్పీటీసీ సభ్యుడు జంగారెడ్డి, ఎంపీపీ నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బాలేష్ తదితరులు గొంతుకలిపారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరుస కరువుతో అతలాకుతలమైన రైతుకు కనీసం పెట్టుబడి రాయితీ సైతం ఇవ్వకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు జంగారెడ్డి, బాలేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ ఆర్థిక సాయం అందకుంటే సాగు పనులు ముందుకెలా వెళ్తాయన్నారు. ఇందుకు జేడీఏ జగదీష్ స్పందిస్తూ ఇన్‌పుట్ సబ్సిడీపై ప్రభుత్వం ఇంకా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. వికారాబాద్‌లో పత్తి రైతులకు నష్టపరి హారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే కాలె యాద య్య ప్రస్తావించగా.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తీర్పు రాగానే అమలు చేస్తామని జేడీ ఏ పేర్కొన్నారు. యాంత్రీకరణ కింద పంపిణీ చేసే పరికరాలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడంలేదంటూ పలువురు లేవనెత్తగా.. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారమిస్తామని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. పంట లు వేయకముందే బీమా ప్రీమియం చెల్లించడాన్ని ఎమ్మెల్యే సంజీవరావు తప్పుబట్టారు.

 ప్రైవేటుకు కత్తెర వేయండి..
ప్రభుత్వ పాఠశాలల్లో అన్నివిధాలా అర్హులైన టీచర్లున్నప్పటికీ.. పిల్లల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఎమ్మెల్యే సంజీవరావు ప్రస్తావించారు. పలుచోట్ల సింగిల్ డిజిట్‌లో విద్యార్థులుంటే.. అవి మూసివేతదిశగా వెళ్తున్నాయన్నారు. డీఈఓ రమేష్ స్పందిస్తూ ప్రస్తుతం బడిబాట సాగుతోందని, పలుచోట్ల ఇంగ్లిష్ మీడియం డిమాండ్ ఉందన్నారు. ఈక్రమంలో ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 382 పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రైవేటు బడుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలుంటే ప్రైవేటుకు ఎలా అనుమతులిస్తారని ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, యాచారం జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ ప్రశ్నించగా..

డీఈఓ స్పందిస్తూ కొత్తగా అనుమతులివ్వడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లేకపోవడంతో పరపతి పడిపోతున్నదని ఎంపీపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈఓలుంటే పరిస్థితి మారుతుందని పేర్కొనగా.. సర్వీసు రూల్స్ అంశం రాష్ట్రపతి వద్దకు చేరిందని డీఈఓ బదులిచ్చా రు. ఉద్యానవనశాఖ ద్వారా రైతుకు పరి హారం ఇచ్చిన సంగతి ప్రజాప్రతినిధులకు చెప్పకపోవడంపై ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు డీడీ బాబుపై మండిపడ్డారు. దీంతో ఆయన స్పందిస్తూ ప్రజాప్రతినిధులకు పరిహారం పంపిణీ జాబితా ఇస్తానన్నారు.

 వైద్యశాఖకు చికిత్స చేద్దాం..
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ గాడితప్పిందని ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. పర్యవేక్షణ కొరవడడంతో ఆస్పత్రుల్లో వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల వైద్యుల హాజరుశాతం అసంతృప్తిగా ఉందని.. ఇది జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ మహేశ్వరంలో వందపడకల ఆస్పత్రి సంగతేమైందంటూ మెడికల్ అధికారులను నిలదీశారు.

ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ వ్యవహారశైలి బాలేదని ఎంపీపీ నిరంజన్‌రెడ్డి ప్రస్తావించగా.. డీఎంహెచ్‌ఓ స్పందిస్తూ ఆమె తనకంటే సీనియర్ అని.. వైద్యశాఖ సంచాలకులు మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సమాధానం చెప్పగా.. సభ్యులు మరింత ఆగ్రహించారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పలు ఆస్పత్రుల్లో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం డీఎంహెచ్‌ఓ నిర్లక్ష్యమని పలువురు ఎంపీపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement