
టీటీడీపీ తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలో 12 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఒక్క చోటన్న గెలవకుంటే పార్టీ పరువు పోతుందన్న ఆందోళనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. దీంతో ఎక్కడ అవకాశం దక్కుతుందా అని ప్రయత్నాలు మొదలు పెట్టింది.
మరో రెండు రోజుల్లో నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు కావడంతో ఈ లోగానే పోటీ చే సే స్థానాలపై మల్లగుల్లాలు పడుతోంది. తమ పార్టీ మిత్ర పక్షమైన బీజేపీకి స్థానిక సంస్థల్లో నామ మాత్రంగా కూడా ఓట్లు లేకపోవడంతో టీ టీడీపీ నేతలు కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్ నేతలను కలిసి తమ ప్రతిపాదనలను ముందు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అవకాశ వాదంతో వ్యవహరిస్తోందని ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ మండిపడుతోందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో కలిసి చర్చించుకుని నిర్ణయానికి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించినా, ఆ మాటలను చెవికి ఎక్కించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పాలమూరులో కాంగ్రెస్తో దోస్తీ!
ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కోట దయాకర్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ఖరారు చేసిన టీ టీడీపీ, రంగారెడ్డి జిల్లాలోనూ ఒక స్థానంలో పోటీ చేసే ఆలోచనలో ఉందంటున్నారు. దీనికోసం కాంగ్రెస్‌తో అవగాహనకు రావాలని ఆ పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఒక చోట ఆ పార్టీ మద్దతు కోసం అవగాహన కుదుర్చుకుంటే, మిగిలిన జిల్లాల్లో అనివార్యంగా టీటీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్‌కే వేయమని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ వంటి జిల్లాల్లో బీజేపీ కూడా స్థానిక సంస్థల్లో కొన్ని ఓట్లున్నాయి. టీడీపీతో ఉన్న పొత్తు వల్ల తాము ఓటు వేస్తే టీడీపీ అభ్యర్ధికి వేస్తాం కానీ, టీడీపీ అవగాహన కుదుర్చుకున్న కాంగ్రెస్‌కు ఎలా వేస్తామన్న ప్రశ్నం బీజేపీ శిబిరం నుంచి వస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ సాయం తీసుకోవాలని టీడీపీ నేతలు భావించడంతో ఈ ఎన్నికల్లో తమకు అవసరం ఏమీ లేదన్న తరహాల్లో వ్యవహరిస్తున్నారని కొందరు బీజేపీ నాయకులు నేరుగా టీడీపీ నాయకులనే నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది. మండలి ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని, రెండు స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానానికే అభ్యర్ధిని ప్రకటించిందని, టీడీపీతో కుదిరిన అవగాహన కారణమంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీడీపీ నుంచి అభిప్రాయం తెలుసుకునే మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ మింగుడు పడని కమల నాథులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని, తెలంగాణ టీడీపీ మిత్ర ద్రోహానికి పాల్పడుతోందని తీవ్రంగానే విమర్శిస్తోందని సమాచారం.
రెండు స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీలు చెరో స్థానంలో పోటీ చేయడంతో పాటు ఓట్ల పంపిణీపైనా మాట్లాడుకున్నట్లు తెలిసింది. టీడీపీ తమ అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యం ఓటు వే సుకుని, కాంగ్రెస్ అభ్యర్ధికి రెండో ప్రాధాన్య ఓటు వేయనుందని, కాంగ్రెస్ కూడా ఇదే తరహాల్లో ఓట్లు వేసే వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారని అంటున్నారు. అయితే, రెండు చోట పోటీ పడినా, ఒక్క చోటనే టీడీపీ కొంత అవకాశం ఉందని, ఒక్క సీటు కోసం నానా తంటాలు పడుతున్న టీటీడీపీ నాయకులు కాంగ్రెస్‌తో చేతులు కలపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ముందు బీజేపీ, టీడీపీల మధ్య ఈ అంశం వివాదానికి కారణమయ్యే ముప్పు ఉందని, జిహెచ్‌ఎంసి ఎన్నికల జరగనున్న తరుణంలో టీడీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి బీజేపీని పక్కన పెట్టడం ఇబ్బంది కరమేనని అభిప్రాయ పడుతున్నారు.