
రహస్య ప్రాంతంలో టీటీడీపీ ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం గులాబీ కండువా కప్పుకోవడంతో తమ ఎమ్మెల్యేలని కాపాడుకొనే ప్రయత్నాలను టీడీపీ ముమ్మరం చేసింది. మాధవరం బాటలోనే మరికొందరు పార్టీని చేజారకుండా చూసుకునేందుకు ఎమ్మెల్యేలను టీటీడీపీ నాయకత్వం రహస్య ప్రాంతంలో ఉంచింది. ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జరుగనుండటంతో రహస్య ప్రాంతంలో ఉంచిన టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా అసెంబ్లీకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఐదో అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న కేసీఆర్ పట్టు కారణంగానే కృష్ణారావు చేరినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన పట్టును కోల్పోతున్నట్లు అవుతోంది.
ఇదిలాఉండగా మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం మాధవరం బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేయించే వ్యూహంలో భాగంగా.. ఆత్మప్రబోధంతో ఓటేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యే చేరిపోవడం, మరో ఇద్దరు చేరికకు సిద్ధంగా ఉండటం తమకు ఓటింగ్‌లో కలిసొచ్చే అంశమని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.