
రాజమండ్రి ఎందుకు వెళ్లినట్టు?
► తల్లీబిడ్డల మరణంపై అనుమానాలు
► వట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లభ్యమైన మృతదేహాలు
► మంగళవారం రాత్రే గాయాలతో శిశువు గుర్తింపు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట)/ఏలూరు (అర్బన్) : వట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై బుధవారం తల్లీబిడ్డల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా.. లేక ప్రమాదమా అనేది తెలియరావడం లేదు. ఈ దుర్ఘటన మంగళవారం రాత్రే జరినట్టు అధికారులు చెబుతున్నారు. రైల్వేపోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. టి.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన దొండపాటి ప్రభావతి(30) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ కొమ్ముకూరి ప్రసాద్ వద్ద పెరిగింది.
ఈమెకు ఆరేళ్ల కిందట లింగంపాలెం మండలం బాదరాల గ్రామానికి చెందిన దొండపాటి కోటేశ్వరరావుతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె మహాలక్ష్మి, పదినెలల కుమారుడు మహీధర్ ఉన్నారు. కోటేశ్వరరావు కూలి పనులు చేస్తూ ఉంటాడు. కొంతకాలంగా కోటేశ్వరరావు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. దీనిపై ప్రభావతి, కోటేశ్వరరావు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గతంలో రెండుసార్లు తన బతుకు తాను బతుకుతానని ప్రభావతి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో ఇరుపక్షాల పెద్దలు జోక్యం చేసుకుని కోటేశ్వరరావు సక్రమంగానే ఉంటాడని నచ్చజెప్పి ప్రభావతిని కాపురానికి పంపారు. అయినా కోటేశ్వరరావు ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో రెండురోజుల కిందట కొడుకు మహీధర్‌కు జ్వరం రావడంతో ప్రభావతి పెద్ద డాక్టర్‌కు చూపించాలని భర్తను కోరింది. ఈ విషయం అతను పట్టించుకోకపోవడంతో ప్రభావతి మంగళవారం తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఏలూరు ఆస్పత్రికి వెళ్తున్నానని ఇరుగుపొరుగు వారికి చెప్పి బాదరాల నుంచి బయలుదేరింది. ఆమె నేరుగా రాజమండ్రి వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ ఏలూరు వచ్చేందుకు టికెట్ తీసుకుని రైలు ఎక్కింది. ఏలూరులో ఆమె రైలు దిగలేదు. పవర్‌పేట స్టేషన్ దాటిన తరువాత వ ట్లూరు పమీపంలో ఆమె కొడుకు మహీధర్ రైలు నుంచి పడిపోయాడు.
ఆ తరువాత ప్రభావతి ఆమె కూతురు మహాలక్ష్మి కూడా రైలు నుంచి పడిపోయారు. ప్రభావతి రైలు చక్రాల కిందపడి నుజ్జునుజ్జుకాగా.. కూతురు మహాలక్ష్మి తీవ్రగాయాలతో మరణించింది. ఈ నేపథ్యంలో ఏలూరు రైల్వే పోలీసులకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో నెలల శిశువు రైలు పట్టాలపై గాయాల తో పడి ఉన్నాడని సమాచారం అందడంతో వారు శిశువును ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బుధవారం శిశువు దొరికిన ప్రాంతానికి కొద్దిదూరంలో మహిళ, ఐదేళ్ల బాలిక మృతదేహాలు పడి ఉన్నాయని రైల్వే పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి దొరికిన శిశువుకు, ఈ మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో వారు విచారణ చేపట్టడంతో మృతులు బాదరాలకు చెంది న తల్లీకూతుళ్లుగా గుర్తించారు. దుర్ఘటనపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు, ప్రభావతి భర్త కోటేశ్వర రావు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు
ప్రభావతి, ఆమె కుమార్తె మహాలక్ష్మి మృతదేహాలు లభించిన తీరు, ఆమె కుమారుడు గాయాలతో పడి ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసినట్లు ఏలూరు రైల్వే ఎస్‌ఐ నాయుడు రాము విలేకరులకు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బాదరాలలో విషాదఛాయలు
లింగపాలెం : తల్లీబిడ్డల మృతితో బాదరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఖిన్నులయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రభావతి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పదినెలల మహీధర్ తల్లిపాల కోసం రోదిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.
భర్త వేధింపులే కారణం ప్రభావతి మేనమామ ప్రసాద్ ఆరోపణ
ప్రభావతి భర్త వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె మేనమామ కొమ్ముకూరి ప్రసాద్ రోదిస్తున్నారు. ప్రభావతి మృతివార్త టీవీల ద్వారా తెలుసుకున్న ఆయన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మేనకోడలి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభావతిని కన్న కూతరి కంటే ఎక్కువగా చూసుకున్నానని, ఆమె ఇలా విగతజీవిగా మారడం తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త వేధింపులే తన మేనకోడలి చావుకు కారణమని ఆరోపించారు. ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పారు. ప్రభావతి ఈ విషయం తనకు ఎన్నోసార్లు చెప్పిందని, అతనిలో మార్పు వస్తుందని సర్దిచెప్పి పంపానని రోదించారు. కోటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు.
సమాధానం దొరకని ప్రశ్నలెన్నో!
ఈ దుర్ఘటన వెనుక కారణాలు అంతుబట్టడం లేదు. ప్రభావతి బిడ్డలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ప్రమాదవశాత్తూ ముగ్గురూ రైలులో నుంచి పడిపోయారా?తొలుత శిశువు పడిపోవడంతో మిగిలిన ఇద్దరూ దూకేశారా? లేక ఎవరైనా తోసేశారా? అన్నది అంతుచిక్కడం లేదు. మృతురాలి వద్ద లభించిన టికెట్ ఆధారంగా ఆమె రాజమండ్రి నుంచి ఏలూరుకు వస్తున్నట్టు తెలిసింది. అసలు ఏలూరు
ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పిన ప్రభావతి రాజమండ్రి ఎందుకు వెళ్లినట్టు?
అక్కడి నుంచి మళ్లీ ఏలూరు ఎందుకు వచ్చినట్టు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. దీనిపై ఆమె భర్త, కుటుంబసభ్యులను ప్రశ్నిస్తే తెలీదనే సమాధానమే వస్తోంది.
రాజమండ్రిలో తమకు బంధువులు గానీ, స్నేహితులుగానీ లేరని చెబుతున్నారు. ఏలూరుకు టికెట్ తీసుకున్న మృతురాలు ఏలూరులో ఎందుకు దిగలేదు? వట్లూరు వరకూ ఎందుకు వెళ్లిం ది? అనేది కూడా అంతుబట్టడం లేదు. ప్రభావతి ఆత్మహత్య చే సుకోవాలనుకుంటే రాజమండ్రి ఎందుకు వె ళ్లినట్టు? వట్లూరు సమీపంలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు అనేది అనుమానాస్పదంగా మారింది. ఒకవేళ ఎవరికీ తెలియని చోటుకు ప్రభావతి వెళ్లిపోదామనుకుందా? ఈ క్రమంలో బాబు ప్రమాదవశాత్తూ జారి పడడంతో ఆమె, బాలిక దూకేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.