కన్నీటి పంట
► అకాల వర్షంతో జిల్లాలో భారీగా నష్టం
► దెబ్బతిన్న మొక్కజొన్న, పొగాకు, నువ్వులు
► బూజుపడుతున్న మిర్చి
► నూజివీడులో నేలరాలిన మామిడి
► గింజ రాలిపోతున్న మినుము
మచిలీపట్నం : అకాల వర్షం రైతులకు అపార నష్టం కలగజేసింది. ఊహించని విధంగా ఆదివారం కురిసిన వర్షం, బలమైన గాలులకు మొక్కజొన్న, పొగాకు, నువ్వు, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా నూజివీడు, బాపులపాడు, పమిడిముక్కల, ముసునూరు, వీరులపాడు తదితర ప్రాంతాల్లో వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 2,575 ఎకరాలు, పొగాకు 225 ఎకరాలు, నువ్వులు 60 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇచ్చేవిషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉం టుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
మొక్కజొన్న.. ఆందోళనలో రైతన్న
నూజివీడు మండలం తుక్కులూరు, జంగంగూడెం, మోర్సపూడి, బాపులపాడు, పమిడిముక్కల తదితర మండలాల్లో మొక్కజొన్న గింజలు కట్టే దశలో ఉంది. ఈదురుగాలుల ప్రభావంతో గింజలు గట్టిపడవని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చు చేశామని, కీలకదశలో పైరు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతులకు మరో రూ.10వేలు అదనంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నూజివీడులో 1.60 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈదురుగాలల ప్రభావంతో కాయలు నేలరాలాయి. నూజివీడు మండలంలో పొగాకు పందిళ్లు తడిచిపోయాయి.
తడిసిన మిర్చి
ఈ ఏడాది జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా మిర్చి సాగైంది. ఎకరాకు లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించగా, 10, 15 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి. గతేడాది క్వింటాలు మిర్చి రూ.12,500 ధర పలకగా, ఈ ఏడాది రూ.5,200 నుంచి రూ.5,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. వీరులపాడు, బాపులపాడు తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మిర్చి తడిచింది. మిర్చి నల్లరంగులోకి మారడం.. బూజుపట్టే అవకాశం ఉండటంతో నాణ్యత తగ్గి ధర మరింత దిగజారుతుందని రైతులు వాపోతున్నారు.
ముంచిన మినుము
జిల్లాలో ఈ ఏడాది 3.86 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేశారు. 60 శాతం మేర మినుముతీత జరిగింది. మిగిలిన 40 శాతం మినుముతీత దశలో ఉంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం కురవడంతో పనలపై ఉన్న మినుము తడిచింది. ఎండిన మినుముకాయలు వర్షానికి తడిచి గింజలు రాలిపోతాయని రైతులు చెబుతున్నారు. మినుముకు జరిగిన నష్టంపై తమకు సమాచారం రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.