వాల్మీకుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఉద్యమం
– భారతీయ వాల్మీకి సేన ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర
– ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య
కల్లూరు: వాల్మీకుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హెచ్చరించారు. ఆదివారం పందిపాడు గ్రామంలో భారతీయ వాల్మీకి సేన (బీవీఎస్) ఆధ్వర్యంలో పేద వాల్మీకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్ర ప్రారంభించారు. కార్యక్రమానికి అతిథులుగా వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బీజేపీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ వాల్మీకి సామాజిక వర్గంలో అధిక సంఖ్యలో పేదలు, నిరక్ష రాస్యులున్నారని తెలిపారు. ప్రతి వాల్మీకి తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. ఎన్నికల్లో రాజకీయపార్టీలకు ఓటు బ్యాంకుగా మారకుండా సంఘటితంగా ఉండి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బీజేపీ నాయకులు నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకులందరూ ఐక్యమత్యంతో ఉండాలన్నారు. బీవీఎస్ అధ్యక్ష కార్యదర్శులు మద్దులేటినాయుడు, రమేష్ నాయుడు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు సైకిల్ యాత్ర జరుగుతుందని, తుగ్గలి మండలం ఆర్‌ఎస్ పెండేకల్‌లో ముగింపు సభ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఎంపీటీసీ మాజీ సభ్యుడు పూల ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శివశంకర్, శ్రీనివాసులు, శేషన్న, శంకరన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.