దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం
సామూహిక వ్రత నిర్వహణకు ఏర్పాట్లు
ఈవో సూర్యకుమారి వెల్లడి
ఒక్కో టికెట్ రూ. 1500
ఇంద్రకీలాద్రి :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 26వ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈవో సూర్యకుమారి తెలిపారు. వ్రతం జరిగే రోజున అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తిని మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు. వ్రతంలో పాల్గొనేందుకు టికెటు ధరను రూ. 1500గా ఆలయ అధికారులు నిర్ణయించారు. మహా మండపంలోని ఆరో అంతస్తులోని ఆర్జిత సేవల ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 6 గంటల నుంచి 8–30 గంటల వరకు , రెండో షిప్టు ఉదయం 10–30 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు నిర్ణయించారు. ఇక వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రితో పాటు కుంకుమ భరిణ, అష్టలక్ష్మీ యంత్రం, కాళ్ల మెట్టెలు, రవిక, అమ్మవారి లామినేషన్ ఫోటో, అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం అందచేస్తుంది.
24 నుంచి టికెట్ల విక్రయాలు
స్థలాభావం కారణంగా టికెటు కొనుగోలు చేసిన ముల్తైదువునే వ్రతం ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ నెల 24వ తేదీ నుంచి టికెట్లు దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్‌లో లభిస్తాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలకు దేవస్థాన టోల్‌ప్రీ నెం.1800 4259 099 కు సంప్రదించవచ్చు.