అశ్లీల నృత్యాలు వద్దన్నందుకు పోలీసులను కొట్టారు
హిజ్రాలతో అశ్లీల నృత్యాలు ఆపు చేయించేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఎస్సై సహా ముగ్గురిని రాళ్లతో కొట్టారు. పోలీసు జీపును ధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పాకాలపల్లెపాలెంలో గణేశ్ మంటపం వద్ద ఆదివారం రాత్రి హిజ్రాలతో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపాలని గ్రామస్తులను కోరారు. వారు నిరాకరించటంతో లాఠీచార్జికి పూనుకున్నారు.
దీంతో రెచ్చిపోయిన స్థానికులు దాడికి యత్నించగా పోలీసులు పరుగెత్తారు. రాళ్ల దాడిలో హోంగార్డు ఉపేంద్ర తలకు తీవ్రంగా, ఎస్సై రమణయ్యకు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసు జీపును కూడా ధ్వంసం చేశారు. ఘటన సమాచారంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులను కూడా గ్రామస్తులు కొంతసేపు నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం గ్రామంలో సుమారు 70 మంది పోలీసులను మోహరించారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని, గ్రామస్తులతో మాట్లాడారు. దాడికి కారకులను తమకు అప్పగించాలని ఆయన గ్రామపెద్దలను కోరారు. అయితే, రాత్రి చీకట్లో పోలీసులను గాయపరిచి, జీపును ధ్వంసం చేసిన వారెవరో తమకు తెలియదని..కావాలంటే గ్రామస్తులందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లాలని వారు సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.