గండ్లేరు రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న ఎస్‌ఐ చంద్రశేఖర్ రావ్
నీటి వృథా సరికాదు
Published Tue, Sep 6 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
– ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు సూచన
– నిరంతరం పర్యవేక్షణ
– అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
రుద్రవరం: సాగునీటి వృథాకు కారణమయ్యే అధికారులను ఉపేక్షించబోమని ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రుద్రవరం మండల పరిధిలోని తెలుగుగంగ ప్రధాన కాల్వను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రధాన కాల్వపై ఏర్పాటు చేసిన గండ్లేరు రిజర్వాయర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ప్లో పూర్తిగా తగ్గిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగుగంగ ప్రధాన కాల్వ ద్వారా కడప జిల్లాకు తాగు, సాగు నీటిని అందించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లా బ్రహ్మసాగర్‌కు నీరు చేర్చేందుకు కాల్వ వెంట రెవెన్యూ అధికారుల సాయం పొందుతున్నామన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు నుంచి వెలుగోడు రిజర్వాయర్‌కు చేరుతోందన్నారు. ప్రస్తుతం వెలుగోడు రిజర్వాయర్‌లో 12.4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
తెలుగుగంగ అధికారులపై ఆగ్రహం..
గండ్లేరు రిజర్వాయర్ గేట్ల నుంచి ఆలమూరు పరిసర ప్రాంతాలకు దొడ్ల వాగుద్వారా అందించే నీరు వథా అవుతున్నట్లు తెలుసుకున్న ఎస్‌ఈ.. ఆళ్లగడ్డ డివిజన్ ఈఈ మాధవరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దరాజు చెరువు ప్రాంతంలో నీటి ప్రవాహన్ని పరిశీలించిన ఆయన నీటి వథాను అరకట్టాలని నంద్యాల డివిజన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట నంద్యాల డివిజన్ ఈఈ పురుషోత్తం రెడ్డి, డిఈ నరేంద్ర కుమార్, ఏఈ రామశేషు, ఆళ్లగడ్డ డివిజన్ డిఈలు సుబ్బారెడ్డి, నరసింహారావు, ఏఈ గణేష్‌రెడ్డి ఉన్నారు.
Advertisement