కరువు సీమకు నీరివ్వండి..
► నీటిపై ట్రిబ్యునల్‌కు కేంద్రం ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి
► అఖిలపక్ష సమావేశంలో నేతల డిమాండ్
కడప సెవెన్‌రోడ్స్: కరువు ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగునీరు, కనీసం ఒక ఆరుతడి పంటకు అవసరమయ్యే సాగునీరు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు స్పెషల్ ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఆరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వెళ్లి ప్రధాని మోదీకి ఈ మేర కు విన్నవించాలని తీర్మానించారు.
బుధవారం కడప హరిత హోటల్‌లో రాయలసీమ అభ్యుదయ సంఘం నాయకుడు ఇస్మాయిల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలు తమ గళాన్ని వినిపించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, సీనియర్ పాత్రికేయుడు వై.నాగిరెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు శ్రీరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు మీసాల రంగన్న, చవ్వా రాజశేఖర్, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి
కరువు ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు స్పెషల్ ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాల్సిన అవసరం ఉంది. 1956 నాటి ఇరిగేషన్ యాక్టులో కూడా కరువు ప్రాంతాల నీటి అవసరాలు తీర్చాలనే అంశం లేదు. దీనికి చట్టసవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. కరువు సీమకు నికర జలాల కేటాయింపుపై ఆర్డినెన్స్ తీసుకు రావాలని కేంద్రాన్ని అడగాలి. ఈ డిమాండ్ల సాధనకు అవసరమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలి. – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప లోక్‌సభ సభ్యుడు
సమగ్ర గణాంకాలతో నివేదిక ఇవ్వాలి
రాష్ట్రానికి కేటాయించిన జలాలను పునః పంపిణీ చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. రాయలసీమలో ఏటా తాగునీరు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు. అలాగే నష్టపోయిన పంటలకు కోట్లాది రూపాయలు ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా కింద చెల్లిస్తున్నారు. ఇలాంటి సమగ్ర గణాంకాలతో నివేదిక రూపొందించి ప్రధానమంత్రికి సమర్పిస్తే సీమ దయనీయ పరిస్థితులు ఆయనకు అర్థమవుతాయి. అప్పుడే నీటి విషయంలో మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. – ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు
ఒక ఆరుతడి పంటకైనా నీరివ్వాలి!
బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు గెజిట్ నోటిఫికేషన్ జరిగితే గాలేరు –నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు చుక్కనీరు అందదు. 2330 టీఎంసీల నీరు కృష్ణాలో పారిన తర్వాతే తెలుగుగంగకు నీరు ఇస్తారు. 1956 నాటి ఇరిగేషన్ చట్టం లోప భూయిష్టంగా ఉంది. అలాగే దుమ్ముగూడెం–సాగర్ టేల్‌ఫాండ్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి
సింగిల్ ట్రిబ్యునల్ ఏర్పాటైతే నష్టం
దేశంలోని ఆరు ట్రిబ్యునల్స్‌ను కలిపి ఒక సింగిల్ ట్రిబ్యునల్‌గా ఏర్పాటు చేయాలని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇదే జరిగితే రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుంది. ‘సీమ’కు 160 టీఎంసీల గోదావరి జలాలను అందించే అవకాశం ఉన్న దుమ్ముగూడెం–సాగర్ టేల్‌ఫాండ్‌ను విభజన చట్టంలో పొందుపరచకపోవడం విచారకరం. నాయకులు స్థానికంగా మాట్లాడితే సరిపోదు. ఢిల్లీ పెద్దలకు మన గోడు వినిపించాలి. – ఇస్మాయిల్‌రెడ్డి, రాయలసీమ అభ్యుదయ సంఘం
గోదావరి నీటిలో ‘సీమ’కు ప్రాధాన్యత
గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించడం ద్వారా లభించే నీటిలో సీమకు మొదటి ప్రా«ధాన్యత ఇవ్వాలి. రాష్ట్రానికి వచ్చిన నికర జలాలను పునః పంపిణీ చేయాలని సీఎంను కోరాలి. – గఫూర్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
నీటితోనే అభివృద్ధి సాధ్యం
సాగునీరు లభిస్తేనే పంటలు పండి అభివృద్ధి జరగడంతోపాటు ప్రజల జీవనశైలి మెరుగుపడుతుంది. రాయలసీమ కు ఒక ఆరుతడి పంటైనా నీరివ్వాలి. దుమ్ముగూడెం–సాగర్ టైల్‌ఫాండ్‌ను జాతీ య ప్రాజెక్టుగా చేపట్టాలి. –జి.శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి
ఆ నీటిని ఎక్కడి నుంచి ఇస్తారు..
కోస్తాలో వర్షం, భూగర్భ జలాలు అధి కంగా ఉన్నాయి. సీమ నీటి అవసరాల పై శాస్త్రీయంగా ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాలి. సీమకు 450 టీఎంసీల నీటిని ఇస్తామని సీఎం అంటున్నారు. అవి ఎక్కడి నుంచి ఇస్తారో తెలపాలి. – గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ
గోదావరి–పెన్నా మోసపూరితం
ప్రభుత్వం చెబుతున్న గోదావరి–పెన్నా అనుసంధానం పూర్తిగా మోసపూరితం. పోలవరానికి ఇస్తున్న ప్రాధాన్యత సీమ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదు. కరువు ప్రాంత ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసుకోవడం ముఖ్యం. –బి.నారాయణ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు
‘సీమ’గోడు ప్రధానికి విన్నవించాల్సిందే!
నికర జలాలను పునః పంపిణీపై నేను శాసనమండలిలో చర్చ లేవదీస్తే సీఎం, అధికా రపక్షం అడ్డు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–దిండి ప్రాజెక్టు నిర్మిస్తే మన పరిస్థితి దుర్భరంగా మారుతుంది. – సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ