రూ.470 కోట్లు దుర్వినియోగం
► అధికార పార్టీ కార్యకర్తల ఆదాయం కోసం ఖర్చు
► ఈ నిధులు తెలుగుగంగకు ఖర్చు చేస్తే రైతులకు ఉపయోగకరం
► ఎంపీ అవినాష్‌రెడ్డి
బ్రహ్మంగారిమఠం: ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ కార్యకర్తలకు ధనార్జన చేకూర్చుతున్నారే తప్ప అభివృద్ధి పనులు ఎక్కడా కన్పించలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు, కడపఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని చెంచయ్యగారిపల్లె గ్రామంలో దేవర మహోత్సవం సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు సి. వీరనారాయణరెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన అనంతరం వీరు విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాకు కేంద్రం నుంచి ఎస్‌డీపీ నిధులు ఏడాదికి రూ.50కోట్లు, ఉపాధిహామీ పథకం నిధులు రూ.320 కోట్లు వచ్చాయని, వీటిని కార్యకర్తల ధనార్జన కోసం నీరు–చెట్టు పేరుతో దుర్వినియోగపరుస్తున్నారే తప్ప ఎక్కడా అభివృద్ధి జరుపలేదన్నారు.
ఈ నిధులను తెలుగుగంగకు ఖర్చు చేసి ఉంటే బ్రహ్మంసాగర్‌లో 10టీసీఎంల నీరు చేరేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో బ్రహ్మంసాగర్‌కు నీటిని మల్లించడానికి 15వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువను ఏర్పాటు చేశారన్నారు. నీరు విడుదల విషయంలో అప్పట్లో ఆయన అధికారులపై ఒత్తిడి చేసి 12.5టీఎంసీలు నిలువ ఉంచగలిగారన్నారు. చంద్రబాబు హామీలతో కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు.
సీనియర్ శాసనసభ్యులు రఘురామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు గంగ ప్రాజెక్టు బడ్జెట్ ఎంతనేది తెలియకుండా టీడీపీ ఇన్‌చార్జి ప్రధాన కాలువ మరమ్మతులకు రూ.200కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పుకోవటం అర్థరహితమన్నారు. ఏ మండలానికి వెళ్లినా మూడు నెలల నుంచి డబ్బులు రాలేదని ఉపాధి కూలీలు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మంసాగర్‌కు కనీసం 10టీఎంసీల నీరు విడుదల చేస్తే బద్వేలు నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో చాలా మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, దీనిపై ప్రభుత్వం సరిగా స్పందించలేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై మక్కువ చూపుతున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ చూపటం లేదన్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రజలు ఎదు రు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు వీరనారాయణరెడ్డి, కాశినాయన, బీకోడూరు, పోరుమామిళ్ల, బీమఠం మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.