
'చేతకాని వాళ్లే అలా అంటారు'
హైదరాబాద్: చేతకాని వాళ్లు, చేతులెత్తేసిన వాళ్లు ఏమైనా చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున అన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నుంచి పలువురు అధికార మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై గట్టిగా నిలబడలేనివాళ్లు కేంద్రాన్ని నిలదీయలేని వాళ్లు ఇక రాష్ట్రాన్ని ఎలా సంక్షేమ బాటలో నడిపిస్తారని ప్రశ్నించారు. ముందు నుంచి కూడా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్నారని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారని, దేశం నడిబొడ్డున దీక్ష చేపట్టారని గుర్తు చేశారు.
ఇప్పుడు చేయబోయే నిరవధిక నిరాహార దీక్ష మరో ఉద్యమం కాబోతుందని చెప్పారు. ఇక మరోనేత విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో భాగస్వాములై ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందిపోయి వారిని పొగడటంతోనే సరిపెడుతున్నారని చెప్పారు. సంకుచిత మనస్తత్వంతో చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైఎస్ జగన్ నిర్మాణాత్మక దీక్షకు దిగారని ప్రత్యేక హోదా సాధించేవరకు దీక్ష ఉంటుందని తెలిపారు.