ఆ ల్యాప్‌టాప్‌లో ఏముంది..?
* మావోయిస్టుల కార్యకలాపాలపై పోలీసుల ఆరా
* అగ్రనేతల కోసం జల్లెడ పడుతున్న బలగాలు
భద్రాచలం: ఆ ల్యాప్‌టాప్‌లో ఏముందో..దానిలో ఎవరెవరి వివరాలు ఉన్నాయో? ఆ పెట్టెలో దాగి ఉన్న సమాచారంతో ఎవరి బాగోతం బయట పడుతుందో..? అంతటా ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన అంశమిదే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశంలో పోలీసులకు అధునాతన ఆయుధాలతోపాటు, ఓ ల్యాప్‌టాప్, రెండు ప్రింటర్లు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు బయటకు వెల్లడించకపోవటానికి గల కారణాలేమటన్నదానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
అగ్రనేతల వద్దనే ల్యాప్‌టాప్‌లు, ప్రింటింగ్ మిషనరీ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలోంచి కూడా ల్యాప్‌టాప్‌ల ద్వారా మావోయిస్టులు తమ కార్యకలాపాల సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో లభించిన ల్యాప్‌టాప్‌లో నిగూఢమైన సమాచారమేదో ఉందని, అందుకనే ఇప్పటివరకు పోలీసులు వాటి స్వాధీనంపై ప్రకటన చేయలేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు.
అగ్రనేతలు పాల్గొన్న ప్లీనరీలో లభించిన ఈ ల్యాప్‌టాప్‌ను పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా మావోయిస్టుల కార్యకలాపాలు ఏ రీతిన సాగుతున్నాయనే దానిపై ఓ అంచనాకు రావటంతో పాటు, వారికి సహరిస్తున్నవారెవరైనా ఉన్నారా..? అనే వివరాల కోసం పూర్తిస్థాయిలో శోధిస్తున్నారు. ఇదిలా ఉంటే ల్యాప్‌టాప్‌లో ఏముందోననే దానిపై సర్వత్రా చర్చసాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులతోపాటు, ఏజెన్సీ ప్రాంతంలో కోట్లాది రూపాయలతో పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. తమ పేర్లు దానిలో ఉంటే, పోలీ సులు భవిష్యత్‌లో చేపట్టే విచారణలో ఎటువంటి ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.
తప్పించుకున్నవారి కోసం వేట
బొట్టెంతోగు ప్లీనరీ నుంచి తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలతోపాటు, వందలాది మందిగా పాల్గొన్న వారు ప్రస్తు తం ఎక్కడ తలదాచుకున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి కోసమని ప్రత్యేక పోలీసు, గ్రేహాం డ్స్ బలగాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగానే గురువారం రాత్రి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దబ్బమడక అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ పరిణామాలతో సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరం నెలకొంది.
గాయపడినవారు ఎక్కడ?
బొట్టెంతోగు ప్లీనరీపై ప్రత్యేక పోలీసు, గ్రేహౌండ్స్ బలగాలు ఒక్కసారిగా మెరుపుదాడి చేయటంతో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం నాటికి మరో మృతదేహం కూడా అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లుగా ప్రచారం సాగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీ కరించడం లేదు. పోలీసుల మెరుపుదాడిలో పదుల సంఖ్యలోనే మావోయిస్టులు గాయాలపాలైనట్లుగా పరిసర గ్రామాలకు చెందిన ఆదివాసీలు చెబుతున్నారు.
ఎన్‌కౌంటర్ ముగి సిన తర్వాత మంగళవారం రోజు సాయంత్రం ఆ ప్రదేశానికి వెనుదిరిగి వచ్చిన కొంతమంది మావోయిస్టులు, గాయపడిన వారికి తగిన రీతిలో సాయం చేయాలని పరిసర గ్రామా ల ప్రజలకు చెప్పి వెళ్లినట్లుగా తెలిసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, గాయాల పాలైన మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.