అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
శోభనాద్రిపురం (రామన్నపేట) : అప్పులబాధ తట్టుకోలేక ఓ కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శోభనాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాసుల భిక్షం (55) తనకున్న రెండెకరాల పొలంతో పాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని కొంతకాలంగా వరిని సాగుచేస్తున్నాడు. పెట్టుబడులు, కౌలు చెల్లించేందుకుగాను సీసీ బ్యాంకుతో పాటు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేశాడు. ఆ అప్పులను ఎలా తీర్చలని కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. తీవ్ర మనోవేధనతో ఉన్న భిక్షం ఎప్పటిలాగే ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్ద వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటి ఆయన నోటి నుంచి నురుగులు రావడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌లో రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు కాసుల ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్యారసాని శీనయ్య తెలిపారు. కాగా, మృతుడికి భార్య సావిత్రమ్మతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి...
అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కాసుల భిక్షం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకుడు మేక అశోక్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య కోరారు. ఏరియా ఆస్పత్రిలో ఉన్న భిక్షం మృతదేహాన్ని వారు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు. వారి వెంట పబ్బతి లింగయ్య, కాసుల సైదులు, గోగు లింగస్వామి, ముక్కాముల మల్లేశం ఉన్నారు.