ఎలాంటి చర్చలు జరపకుండా తొమ్మిది కీలక బిల్లులను ఎలా ఆమోదిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు
హైదరాబాద్: ఎలాంటి చర్చలు జరపకుండా తొమ్మిది కీలక బిల్లులను ఎలా ఆమోదిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అడిగినంత సమయం ఇవ్వకుండా తమ ఆవేదన పట్టించుకోకుండా అధికార పక్షం ఇలా ముందుకు వెళ్తే తామేం చేయగలమని ప్రశ్నించారు. తమను బుల్డోజ్ చేసే ప్రయత్నం అధికార పక్షం చేస్తోందని వైఎస్ జగన్ అన్నారు. పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సమయంలో గురువారం ఆయన సభలో మాట్లాడుతూ పొద్దున్న బిల్లులు పెట్టి అప్పుడే చర్చపెట్టి మాట్లాడమంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.
ఒక బిల్లు విషయాన్ని పూర్తిగా తెలుసుకోవలన్నా, సవరణ చేయాలన్న కనీసం మూడు రోజులు పడుతుందని, ఇప్పుడికిప్పుడే బిల్లులు పెట్టి పాస్ చేస్తే తాము వాకౌట్ చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. పదిహేను రోజులు సమయం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని, కనీసం వారం రోజులు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా ఐదు రోజులు ఇచ్చి ఇన్ని బిల్లులు ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. నిబంధనల ప్రకారం చూసుకున్నా కనీసం ఏడు రోజుల ముందు బిల్లులను ఇస్తే దానిపై చర్చించుకొని సవరణలైనా, సూచనలైనా చేయగలమని స్పీకర్తో అన్నారు.
నిన్న కొన్ని బిల్లులు పెట్టి, ఈ రోజు ఉదయం హడావిడిగా కొన్ని బిల్లులు పెట్టి అప్పటికప్పుడే చర్చ పేరుతో మొదలుపెట్టి ఆమోదిస్తారని, మీరేమో బిల్లులు పాస్డ్ పాస్డ్ అంటారని స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా, స్పీకర్ స్పందించకపోవడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.